Phone Tapping: ఇక బీఆర్‌ఎస్ నేతలకు సిట్ నోటీసులు
ABN, Publish Date - Jun 29 , 2025 | 04:05 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్న బీఆర్‌ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సన్నద్ధమైనట్లు సమాచారం. ఇప్పటి వరకు బాధితులుగా ఉన్న 200 మందికి పైగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, మీడియా ప్రతినిధుల వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది.
ట్యాపింగ్ బాధితుల్లో ఆ పార్టీ నేతలు
ఇప్పటి వరకు 200 మందికి పైగా
బాధితుల నుంచి వాంగ్మూలాల నమోదు
కవిత పీఏకు సిట్ నోటీసులంటూ ప్రచారం
నిర్ధారించని సిట్ అధికారులు
అనుబంధ చార్జిషీట్‌కు రంగం సిద్ధం
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్న బీఆర్‌ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సన్నద్ధమైనట్లు సమాచారం. ఇప్పటి వరకు బాధితులుగా ఉన్న 200 మందికి పైగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, మీడియా ప్రతినిధుల వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది. బాధితులుగా ఉన్న బీఆర్‌ఎస్ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల వాంగ్మూలాలను త్వరలో నమోదు చేయనున్నట్లు తెలిసింది. సిట్ ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాల్లో భాగంగా.. మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో 615 మంది ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు భారతీయ టెలిగ్రాఫ్ చట్టం, ఐటీ చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించింది. బాధితుల వాంగ్మూలాలతో ప్రభాకర్‌రావు పాత్రపై బలమైన ఆధారాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది. న్యాయస్థానాల్లో ఈ కేసు నిలబడి, అక్రమంగా ట్యాపింగ్ చేసిన తీరులో శిక్షలు పడేలా చేసే దిశలో సిట్ వేగంగా అడుగులు వేస్తోంది. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలో నిందితులు మకాం వేసి, ఫోన్ ట్యాపింగ్ చేశారనడానికి నిందితుల సెల్ టవర్ లొకేషన్లు కీలకంగా మారుతాయని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్.. కొత్తగా సేకరించిన ఆధారాలతో త్వరలో అనుబంధ చార్జ్‌షీట్ వేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.నవీన్‌రావును సిట్ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తి అయిన మీడియా చానల్ అధినేత శ్రవణ్‌రావును ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో లాగడం వెనుక నవీన్‌రావు పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. శ్రవణ్‌రావు, ఈ కేసులో అరెస్టు అయిన పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, నవీన్‌రావులకు సంబంధించిన సెల్ టవర్ లోకేషన్ల(నేరం జరిగిన సమయంలో)ను సిట్ ఇప్పటికే సేకరించింది. వీరంతా చాలా సార్లు కలుసుకున్నారన్న విషయాలను సాంకేతికంగా నిర్ధారించుకున్న తర్వాతే నవీన్‌రావును విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవీన్‌రావు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత సిట్ అధికారులు విచారించవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత పీఏకు సిట్ నోటీసులు జారీ చేసిందని ప్రచారం జరుగుతోంది. దీన్ని సిట్ ఉన్నతాధికారులు నిర్ధారించలేదు. కవిత సన్నిహితులు సైతం సిట్ నుంచి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఎలాంటి నోటీసులు రాలేదని చెబుతున్నారు.
నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు: షర్మిల
అమరావతి: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేసిందని, ఈ నిజాన్ని చెబితే చంపేస్తారా అని బీఆర్‌ఎస్ నేతలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరి ఫోన్లనైనా ట్యాప్ చేస్తారా? అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. తీగ లాగుతుంటే డొంక కదులుతుందన్నట్లుగా విచారణలో నిజాలన్నీ బయటపడుతుంటే ఫోన్‌ట్యాపింగ్ నిందితులకు భయం పట్టుకుందన్నారు. ఈ అంశంపై ప్రసారం చేస్తున్న మీడియాసంస్థపై దాడి చేయడం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..
మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్
Updated Date - Jun 29 , 2025 | 04:05 AM