Rahul Gandhi: మేం అధికారంలో ఉన్నప్పుడే కులగణన చేయాల్సింది
ABN, Publish Date - Jul 26 , 2025 | 03:43 AM
తెలంగాణ కుల గణన దేశ రాజకీయాలను కుదిపేసేంత కీలకమైనదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇప్పుడు దేశమంతా తెలంగాణ నమూనా గురించే చర్చిస్తోందన్నారు.
అవకాశాల్లో న్యాయమైన వాటా ఇవ్వాల్సింది
రెట్టింపు వేగంతో పనిచేసి ఆ తప్పు దిద్దుకుంటా
తెలంగాణ కులగణన.. దేశ రాజకీయాల్లో కుదుపు
విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో దీంతో పెను మార్పు
రిజర్వేషన్లలో 50 శాతం అడ్డుగోడను కూల్చేశారు
ప్రైవేట్ విద్యలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోటా
మోదీదంతా ప్రదర్శనే.. ఆయనలో సరుకేమీ లేదు
మీడియా ఆయన ఇమేజీని అతిగా పెంచేసింది
కాంగ్రెస్ భాగీదారీ న్యాయ సమ్మేళనంలో రాహుల్
న్యూఢిల్లీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కుల గణన దేశ రాజకీయాలను కుదిపేసేంత కీలకమైనదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇప్పుడు దేశమంతా తెలంగాణ నమూనా గురించే చర్చిస్తోందన్నారు. కుల గణన తర్వాత రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన భాగీదారీ న్యాయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగంలో రాహుల్‌గాంధీ తాను ఓబీసీ వర్గాలను అర్థం చేసుకోవడం ఆలస్యమైందని అంగీకరించారు. తప్పు చేశానని, 15 ఏళ్ల క్రితమే అధికారంలో ఉండగా కులగణన చేసి ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 2004 నుంచి 21 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, వెనక్కి తిరిగి చూసుకుంటే తాను, కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు చేశామని చెప్పారు. ఓబీసీ వర్గాన్ని రక్షించే విషయంలో వెనుకబడ్డానని అంగీకరించారు. ఓబీసీల సమస్యలను లోతుగా అవగాహన చేసుకోలేక పోయానన్నారు. 15 ఏళ్లకు ముందు దళితులు, ఆదివాసీల సమస్యలను అర్థం చేసుకోగలిగానని, వారి మీదే పూర్తిగా దృష్టి కేంద్రీకరించానని చెప్పారు. అది కాంగ్రెస్ తప్పు కాదని, మార్గదర్శక పాత్రలో ఉన్న తనదే కచ్చితంగా తప్పు అవుతుందని చెప్పారు. ఆ సమయంలోనే కులగణన చేయించి ఉంటే ఫలితం వేరేగా ఉండేదని అన్నారు. ఇప్పుడు తాను చేయాలని చూస్తున్నది 15 ఏళ్ల క్రితమే సాకారమయ్యేదని చెప్పారు. అప్పుడు చేయలేక పోయినందుకు ఇప్పుడు రెట్టింపు వేగంతో చేయబోతున్నానని ప్రకటించారు. తెలంగాణ కులగణన గురించి ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్న డేటాకు దేశంలో ఎక్కడాఎదురు లేదని చెప్పారు. ఈ డేటాతో రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థల్లో ఎంత మంది ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు ఉన్నారో నిమిషంలో తెలుస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థల యజమానుల్లో ఎంతమంది ఓబీసీలు, దళితులు ఉన్నారో కూడా కులగణన డేటా చెప్పగలదని ప్రకటించారు.
ఈ వర్గాల్లో లక్షలు, కోట్ల రూపాయల ప్యాకేజీలు ఎంత మందికి లభిస్తున్నాయని అడిగితే జీరో అనే సమాధానమే వస్తుందని చెప్పారు. దేశంలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు నేటికీ కూలీలుగానే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ బ్యూరోక్రసీలో అణగారిన, బలహీన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదన్నారు. ‘దేశ జనాభాలో దళితులు, ఓబీసీలు, గిరిజనులు, మైనారిటీలంతా కలిపి 90ు మంది ఉంటారు. అయితే బడ్జెట్‌లో హల్వా పంచేటప్పుడు.. (అంటే కేటాయింపులు చేసేటప్పుడు) ఈ 90 శాతం మందికి ఏమీ లేదు. దేశ ఉత్పాదక శక్తిలో 90 శాతం వీరే కదా! హల్వా తయారుచేసేది మీరే. కానీ తింటున్నదేమో వాళ్లు. వాళ్లు తినకూడదని చెప్పడం లేదు. కానీ మీకు కనీసం కొంచెమైనా దక్కాలి కదా’ అని అన్నారు. తెలంగాణలో కులగణనతో రేవంత్ బృందం ఇప్పటిదాకా రిజర్వేషన్ల విషయంలో ఉన్న 50 శాతం అడ్డుగోడను పడగొట్టేశారని ప్రశంసించారు. చదువుకున్న వారు వేగంగా అభివృద్ది చెందుతారని తెలంగాణ సర్వేలో నిరూపితం అయ్యిందని తెలిపారు. విద్యతోపాటు ఇంగ్లీష్ ఉంటే రెండింతల అభివృద్ధి ఉంటుందని తేలిందని చెప్పారు. ఇంగ్లీ్‌షను దేశం నుంచి వెళ్లగొడతామని చెబుతున్న బీజేపీ నేతల పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. లండన్, అమెరికాలో ఉంటున్న నాయకుల పిల్లలు హిందీ మీడియంలో చదువుతున్నారా? అని నిలదీయాలని ప్రజలకు సూచించారు. ప్రాంతీయ భాషలు ఎంత ముఖ్యమో, ఇంగ్లిష్ కూడా అంతే ముఖ్యమన్నారు. పైవ్రేట్ విద్యలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ నినాదమని చెప్పారు.
ఓబీసీల చరిత్రను చెరిపేశారు
కులగణన ద్వారా దేశంలో ఉత్పాదక శక్తికి తగిన గౌరవం దక్కేలా చూడటమన్నది తన లక్ష్యమని రాహుల్‌గాంధీ అన్నారు. ఓబీసీ యువతతమలోని శక్తిని అర్థం చేసుకుంటే పరిస్థితులు తారుమారు అవుతాయని చెప్పారు. దళితులు, ఆదివాసీలు తమ చరిత్రను కాపాడుకున్నారని, దేశానికి ఉత్పాదక శక్తి అయిన ఓబీసీల చరిత్రను ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీలు కలిసి చెరిపేసే ప్రయత్నంలో ఉందని అన్నారు. దేశ జనాభాలో 55 నుంచి 60 శాతం ఉన్న ఓబీసీల చరిత్ర భారతదేశ చరిత్ర పుస్తకాల్లో ఎందుకు కనబడటం లేదని ప్రశ్నించారు. దీన్ని కావాలనే చెరిపేశారనేవిషయం తెలిసిన రోజు ఓబీసీల అసలు శత్రువు ఆర్‌ఎ్‌సఎస్ అని తెలుస్తుందని వ్యాఖ్యానించారు. విద్య, ఉద్యోగం, న్యాయ వ్యవస్థలో కూడా ఓబీసీల పట్ల వివక్ష ఉందన్నారు. ఓబీసీల భూములు లాక్కుని అదానీ, అంబానీలకు ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతీచోట కులగణనతో పాటు సమాజ స్థితిగతులపై ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ చేస్తామని చెప్పారు. ఓబీసీలు ఎంత మంది ఉన్నారు? ఎక్కడున్నారు? సంపదలో భాగస్వామ్యం ఎంత? అనేది తేలుస్తామని ప్రకటించారు. జాతీయ స్థాయిలో కుల గణన జరిగేట్లు చూస్తామని, రిజర్వేషన్లకు ఉన్న 50 శాతం అడ్డుగోడలని పడగొడతామని చెప్పారు.
దమ్ములేని మోదీ!: రాహుల్
ప్రధాని మోదీదంతా ప్రదర్శన మాత్రమేనని.. ఆయనలో సరుకేమీ లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. 2-3 సార్లు ఆయనతో సమావేశమయ్యాక ఆయనలో దమ్ములేదని తెలుసుకున్నానని చెప్పారు. మీడియా ఆయన ఇమేజ్‌ను అతిగా పెంచేసిందని ఆక్షేపించారు. మోదీకి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఆయన మనకో సమస్యే కాదని వ్యాఖ్యానించారు.
మరో 25 సీట్లు వస్తే మోదీ సర్కారు కూలేది: ఖర్గే
నరేంద్ర మోదీ అబద్ధాల కోరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వడానికి మోదీ సిద్దంగా లేరని చెప్పారు. రాజకీయంగా ఎదిగినప్పుడే వెనకబడిన వర్గాలు హక్కులను సాధించుకో గలుగుతాయని అన్నారు. మోదీ ముఖ్యమంత్రి అయ్యాక తన కులాన్ని ఓసీ నుంచి ఓబీసీగా మార్చుకున్నారని తెలిపారు. అందరినీ మట్టిలో కలిపేసి ఒక్కడే బతకాలి అనుకునే రకం మోదీ అని వ్యాఖ్యానించారు. ‘‘మోదీ అబద్ధాలకు సర్దార్. చివరికి.. పార్లమెంటులోనూ అసత్యాలే. అబద్ధాలు చెప్పే ప్రధాని సమాజానికి మంచి చేయలేరు. గత ఎన్నికల్లో కాంగ్రె్‌సకు మరో 25 సీట్లు ఎక్కువ వస్తే మోదీ అదృష్టం తిరగబడేది’’ అన్నారు. 75 ఏళ్ల తర్వాత పదవుల్లో ఉండొద్దని ఆర్‌ఎ్‌సఎస్ చెప్పగానే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి లాంటి నేతలను మోదీ ఇంటికి పంపించేశారని, ఇప్పుడు తనకు 75 ఏళ్లు నిండబోతున్నాయని ప్రస్తావించారు.
రాహుల్‌ది కపటత్వం: బీజేపీ
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్ మాలవీయ విరుచుకుపడ్డారు. ‘ఎత్తిపొడుపులకేం తక్కువ లేదు.. కానీ దాని వెనుక ఆయన కపటత్వమే ఎక్కువగా ఉంది’ అని విమర్శించారు. రాహుల్ కులమేంటని పరోక్షంగా ప్రశ్నిస్తూ.. ‘కేథలిక్ తల్లి, పార్సీ తండ్రికి పుట్టిన కొడుకు ప్రతి ఒక్కరి కులం గురించి అడుగుతూ ఉంటే ఇలాంటివే జరుగుతాయి’ అని ఎద్దేవాచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 07:26 AM