TPCC Leader Jagga Reddy: కులగణన హీరో రాహుల్‌గాంధీ
ABN, Publish Date - May 02 , 2025 | 05:18 AM
కులగణనకు రాహుల్ గాంధీనే దేశ హీరో అని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం నిర్ణయం ప్రశంసనీయం అయినా, కులగణన క్రెడిట్ మాత్రం రాహుల్‌కే చెందుతుందని అన్నారు.
రాష్ట్రంలో రేవంత్, మూడో హీరో మోదీ.. ప్రధాని నిర్ణయం హర్షణీయం.. క్రెడిట్ రాహుల్‌దే
రాహుల్‌గాంధీ ముందు చూపునకు కులగణనే నిదర్శనం
ఆయన బాటలో నడిచి రేవంత్ జాక్‌పాట్
రేవంత్ కులగణనపై కిషన్‌రెడ్డి, కేటీఆర్,హరీశ్ మాటలను ప్రజలు పట్టించుకోరు
దేశవ్యాప్త కుల గణనలో మతాల ప్రస్తావన ఉండదని చెప్పాల్సింది కిషన్‌రెడ్డి కాదు
అదేమైనా గ్రామ పంచాయతీ తీర్మానమా..?
హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సమస్త కులాల వారు భరత మాత బిడ్డలే కదా..?
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి
హైదరాబాద్, మే 1(ఆంధ్రజ్యోతి): కులగణనకు దేశంలో హీరో రాహుల్‌గాంధీనే అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో హీరో రేవంత్‌రెడ్డి అని, ప్రధాని మోదీది మూడో హీరో పాత్ర అని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని, కానీ ఆ క్రెడిట్ మాత్రం రాహుల్‌గాంధీకే దక్కుతుందని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో గురువారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా జనగణనలో కులగణన చేపట్టాలంటూ రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా కులగణన చేపడతామని హామీ కూడా ఇచ్చారని తెలిపారు. రాహుల్ ముందు చూపునకు కులగణన నిదర్శనమన్నారు. కులగణన చేపట్టాలనే కేంద్రం నిర్ణయం పట్ల బీజేపీ నేతలు సంతోషపడినా ఏమీ లాభం లేదన్నారు. ఈ అంశంలో దేశ స్థాయిలో రాహుల్‌గాంధీ, రాష్ట్రంలో కులగణన నిర్వహించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి హీరోలని తెలిపారు. మోదీ కులగణన చేయకపోతే.. రాహుల్ ప్రధాని కాగానే చేసేవారని చెప్పారు. కులగణన క్రెడిట్ రాహుల్‌గాంధీకి రావడం బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదని, రాహుల్‌కు వచ్చిన ఆలోచన మోదీకి ఎందుకు రాలేదని వారికి నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.
రాహుల్‌గాంధీ కుటుంబం.. బీజేపీ నేతల తరహాలో పదవుల కోసం ఎదురు చూసే కుటుంబం కాదని.. ప్రధాన మంత్రులను చేసే కుటుంబమని తెలిపారు. కులగణన విషయంలో సీఎం రేవంత్ అదృష్టవంతుడని, రాహుల్‌గాంధీ లైన్లో వెళ్లి జాక్ పాట్ కొట్టేశారని అన్నారు. రేవంత్ కులగణనపై కిషన్‌రెడ్డి, కేటీఆర్, హరీశ్‌రావు ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకోరని చెప్పారు. కులగణనలో మతాల ప్రస్తావన ఉండదని కిషన్‌రెడ్డి చెబుతున్నారని, అది చెప్పాల్సింది ప్రధాని మోదీ అని అన్నారు. ‘‘కిషన్‌రెడ్డికి ఇష్టం లేదని వదిలేస్తారా..? కులగణనపై తీర్మానం చేయాల్సింది కేంద్ర క్యాబినెట్. అదేమైనా గ్రామపంచాయతీ తీర్మానం అనుకుంటున్నారా..? ముస్లింలు ఈ దేశ పౌరులు కాదా..? దేశంలో పుట్టిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల వారు, సమస్త కులాల వారు భరత మాత బిడ్డలే కదా?’’ అని జగ్గారెడ్డి అన్నారు. దీనిపై ప్రధాని ఏం చెబుతారో చూసి ఆపై స్పందించవచ్చని తెలిపారు.
For Telangana News And Telugu News
Updated Date - May 02 , 2025 | 05:18 AM