Mallikarjun Kharge: గ్రూపులు కడతామంటే.. భయపడం!
ABN, Publish Date - Jul 05 , 2025 | 03:56 AM
ఓ నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యేలతో గ్రూపులు కడతాం.. ఏదో చేస్తామంటే భయపడతామా? నేను గానీ, రాహుల్ గాంధీ గానీ భయపడేది లేదు. ఇలాంటి ఒడిదుడుకులను కాంగ్రెస్ పార్టీ ఎన్నింటినో చూసింది.
కాంగ్రెస్ ఇలాంటి ఒడిదుడుకులను చాలా చూసింది
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు
ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికల్లోనే మాట్లాడాలి
నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలి
తెలంగాణను మోడల్ స్టేట్‌గా తీసుకుంటున్నాం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవాలి
టీపీసీసీ పీఏసీ, విస్తృత సమావేశాల్లో ఖర్గే దిశానిర్దేశం
నామినేటెడ్ పోస్టులకు పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి పంపాలని నాలుగు నెలలుగా కోరుతున్నా స్పందించడం లేదు
మంత్రులపై సీఎం రేవంత్ అసంతృప్తి
హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ‘‘ఓ నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యేలతో గ్రూపులు కడతాం.. ఏదో చేస్తామంటే భయపడతామా? నేను గానీ, రాహుల్ గాంధీ గానీ భయపడేది లేదు. ఇలాంటి ఒడిదుడుకులను కాంగ్రెస్ పార్టీ ఎన్నింటినో చూసింది. పార్టీ నేతలు ఇష్టారీతిన వ్యవహరిస్తే రాహుల్‌గాంధీ అస్సలు సహించరు. పార్టీ క్రమశిక్షణను తప్పి ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు’’ అని పార్టీ రాష్ట్ర నేతలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. పార్టీ నాయకులకు ఏవైౖనా సమస్యలుంటే అంతర్గత వేదికలపై మాట్లాడాలని, లేకుంటే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. బహిరంగంగా మాట్లాడి ప్రతిపక్షాలకు అస్త్రాలు ఇవ్వొద్దని సూచించారు. పార్టీ, ప్రభుత్వం, కొత్త, పాత నేతలు సమన్వయంతో, క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని చెప్పారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీల ఉమ్మడి, విస్తృత కార్యవర్గ సమావేశాల్లో ఖర్గే దిశానిర్దేశం చేశారు. ఇందులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి పాల్గొన్నారు.
తెలంగాణ.. కాంగ్రెస్‌కు మోడల్ స్టేట్!
తెలంగాణను కాంగ్రెస్ మోడల్ స్టేట్‌గా దేశానికి చూపనున్నట్టు ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ సైద్దాంతాలకు అనుగుణంగానే రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా హామీలను సమర్థంగా అమలు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. నేతలు పార్టీ ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరాలన్నారు. అంతకుముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ సమావేశంలో చెప్పారు. ఇక రేవంత్ మంత్రివర్గంలో పనిచేయాలన్నది తన కోరికని, జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ చెప్పారు.
మంత్రులపై సీఎం రేవంత్ అసంతృప్తి!
మంత్రులు, ఆయా జిల్లాల్లో ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న నేతల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నామినేటెడ్ పోస్టులకు ప్రతిపాదనలను షార్ట్ లిస్ట్ చేసి పంపాలని మంత్రులు, పీసీసీ చీఫ్‌ను నాలుగు నెలలుగా కోరుతున్నా.. స్పందించడం లేదని పేర్కొన్నారు. ప్రతిపాదనలు పంపితే వెంటనే ఆమోదిస్తానని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడగానే ప్రతిపాదనలను షార్ట్ లిస్ట్ చేసి ఉంటే.. నామినేటెడ్ పోస్టుల్లో ఒక టర్మ్ అవకాశాలు పూర్తయ్యేవని వివరించారు.
నెలాఖరుకల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ:ఖర్గే
జూలై నెలాఖరుకల్లా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం రేవంత్, మంత్రులు, టీపీసీసీ చీఫ్‌కు ఖర్గే స్పష్టం చేశారు. దీన్ని సమన్వయం చేసుకునే బాధ్యత పీసీసీ చీఫ్‌దేనని.. పార్టీ కోసం కష్టపడిన వారికి, సమర్థులకే పదవులు ఇవ్వాలని సూచించారు. ‘ప్రభుత్వంపై పార్టీ ఫిర్యాదు చేయడం చూశాం గానీ, పార్టీపై ప్రభుత్వం ఫిర్యాదు చేయడం ఇక్కడే చూస్తున్నా’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌కు ఖర్గే సూచించారు. పార్టీకి కార్యకర్తలే బలమని, కాపాడుకోవాలని చెప్పారు.
పార్టీ పదవులను తేలికగా తీసుకోవద్దు: సీఎం
నేతలు పార్టీ పదవులను తేలికగా తీసుకోవద్దని సీఎం రేవంత్ సూచించారు. పార్టీ పదవులతో గుర్తింపు, గౌరవం దక్కుతాయని, రాజకీయాల్లో ఎదుగుదలకు దోహదపడతాయని చెప్పారు. భవిష్యత్తులో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరుగుతాయని, ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయని వివరించారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని కోరారు. అందరూ కష్టపడి పనిచేసి.. కాంగ్రె్‌సను రెండో సారి అధికారంలోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో వచ్చే పదేళ్లూ కాంగ్రెస్‌దే అధికారమని ధీమావ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ మాట్లాడుతూసామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏం చేద్దాం? ఈ నెల 7న క్రమశిక్షణా చర్యల కమిటీ భేటీ
తెలంగాణలో టీడీపీ కోవర్టులున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ జూలై 7న గాంధీభవన్‌లో భేటీ కానుంది. ఆధారాలు చూపకుండా అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందంటూ టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యే అయినందున.. అనిరుధ్‌రెడ్డికి క్రమశిక్షణా చర్యల కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేస్తుందా లేక చర్యల కోసం ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీకి సిఫార్సు చేస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇలా ఉంటే గాంధీభవన్‌లో చైర్మన్ మల్లురవి అధ్యక్షతన క్రమశిక్షణా చర్యల కమిటీ భేటీ అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేతల వివాదంపై పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అభిప్రాయం సేకరించింది. అనంతరం మీడియాతో నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై కమిటీ పెద్దలు తనతో మాట్లాడారన్నారు. చిన్న చిన్న బేధాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని, త్వరలో అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 05 , 2025 | 03:56 AM