ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Weather: రాష్ట్రంలో భిన్న వాతావరణం

ABN, Publish Date - May 06 , 2025 | 06:18 AM

రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది.

ఎండకు అల్లాడుతున్న జనం.. వడదెబ్బకు ముగ్గురి మృతి.. పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం

(ఆంధ్రజ్యోతి నెట్‌ వర్క్‌): రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అత్యధికంగా 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, జోగుళాంబ గద్వాల జిల్లాలో 42 డిగ్రీలు, హైదరాబాద్‌లో 41 డిగ్రీలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. పగటిపూట ఎండకు బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. అయితే ఓ వైపు ఎండ మండుతుండగా మరోవైపు గాలి వాన బీభత్సం సృష్టిస్తోంది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్‌ నగరంలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ఉప్పల్‌, షేక్‌పేట, శేరిలింగంపల్లి, బండ్లగూడ ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. లంగర్‌హౌజ్‌లో అత్యధికంగా 2.8, అసి్‌ఫనగర్‌లో 2.7 సెం.మీల వర్షం కురిసింది. నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా గంటన్నర పాటు వర్షం కురిసింది. అకాల వర్షంతో నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం తడిసి ముద్దయ్యింది.


సంచులలో నింపిన ధాన్యంతో పాటు ఆరబెట్టిన ధాన్యం వర్షానికి పూర్తిగా నీటి పాలైంది. దీంతో సంచులలో ఉన్న ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్‌ మండలంలో వడగళ్ల వాన కురిసింది. ఈదురు గాలులకు మామిడి నేల రాలింది. నువ్వు పంట నేలవాలింది. పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. ఈదురుగాలులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కాగా, ఎండలతో వడదెబ్బకు గురై ఇద్దరు మహిళా కూలీలు, ఓ రైతు మృతి చెందారు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండల కేంద్రంలో అక్కి పార్వతి (51) అనే మహిళా కూలీ నాలుగు రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలులకు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైంది. సోమవారం పరిస్థితి విషమించి మరణించింది. నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల ఆదిరాల గ్రామానికి చెందిన మొల్కలపల్లి నర్సమ్మ (50) శనివారం ఉపాధి హామీ పని చేయడానికి వెళ్ళింది. ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన అత్తిని గంగరాజం (45) అనే రైతు రెండు రోజుల నుంచి వరి కోత పనులు చేయిస్తున్నాడు. దీంతో ఎండదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం పరిస్థితి విషమించి మృతిచెందాడు.


నేడు రేపు వర్షసూచన

రాష్ట్రంలో మంగళ, బుధ వారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడేం, ఖమ్మం, జనగాం, యాదాద్రి, నల్గొండ, గద్వాల, వనపర్తి, నారాయణపేట, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈ మూడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీచేసింది.

Updated Date - May 06 , 2025 | 06:18 AM