Addanki Dayakar: తెలంగాణకు నీటి విషయంలో బీఆర్ఎస్ అన్యాయం: అద్దంకి దయాకర్
ABN, Publish Date - Jun 20 , 2025 | 06:34 PM
తెలంగాణకు నీటి విషయంలో అన్నిరకాలుగా అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీనే అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లు పక్కకు పెట్టడానికి కారణం హరీష్‌రావునే అని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు నీటి విషయంలో బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు.
హైదరాబాద్: గోదావరి - బనకచర్లపై తమ ప్రభుత్వం తప్పు చేస్తున్నట్లుగా మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Congress MLC Addanki Dayakar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బేసిన్ల గురించి తెల్వదని హరీష్‌రావు విమర్శించడం తగదని అన్నారు. ఇవాళ(శుక్రవారం) మీడియాతో అద్దంకి దయాకర్ మాట్లాడారు. రాయలసీమని రతనాల సీమగా చేస్తామని మాజీ మంత్రి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఎల్బీస్టేడియంలో సమావేశం పెట్టీ ఉద్యమ కారులపై వైసీపీ అధినేత జగన్ రెడ్డి దాడి చేశారని... అలాంటి జగన్‌తో నీళ్ల కోసం కేసీఆర్ భేటీ కాలేదా అని నిలదీశారు అద్దంకి దయాకర్.
బనకచర్లకు అనుమతి ఇప్పించే అవకాశాన్ని కల్పించింది హరీష్‌రావు కాదా అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లు పక్కకు పెట్టడానికి కారణం హరీష్‌రావునే అని ఆరోపించారు. తెలంగాణకు నీటి విషయంలో అన్నిరకాలుగా అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీనే అని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు నీటి విషయంలో బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. గతంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్‌కి హరీష్‌రావు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు పరిమితం అవ్వమని చెప్పింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. తెలంగాణ ప్రాజెక్ట్‌ల కంటే ముందు బనకచర్ల పర్మిషన్ వస్తే నికర జలాల్లో ఏపీకి లాభం జరుగుతోందని అన్నారు అద్దంకి దయాకర్.
తెలంగాణకు అన్యాయం జరగకూడదు...
‘కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‌రావు మాట్లాడుతున్నారు.. కానీ తెలంగాణకి జరిగే అన్యాయం గురించి ఎందుకు మాట్లాడటం లేదు. రాయలసీమ నష్టపోవాలని తెలంగాణ కోరుకోదు... కానీ తెలంగాణకు అన్యాయం జరగకూడదని మేము అనుకున్నాం. బీఆర్ఎస్ నేతలకే కనీసం బేసిక్స్ తెల్వదు. నీటి సమస్యలు వచ్చిన ప్రతిసారి నేనే చాంపియన్ అని హరీష్‌రావు అనుకుంటున్నారు. ప్రభుత్వ అంచనాలు తప్పుగా చూపిస్తున్నారు. ఇంత చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు....ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు అవసరమా. అరకొర జ్ఞానంతో ప్రాజెక్ట్‌లు కట్టి లక్షల కోట్ల రూపాయలు నీళ్లపాల్జేశారు. అపెక్స్ కౌన్సిల్‌కి బీఆర్ఎస్ నేతలు ఎందుకు హాజరు కాలేదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రేవంత్‌రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారు’ అని అద్దంకి దయాకర్ తెలిపారు.
హరీష్‌రావు అబద్ధాలు ఆడుతున్నాడు
‘తెలుగు రాష్ట్రాల సమస్యల మధ్య ఆజ్యం పోసినట్లుగా బీజేపీ నేతలు ఉండొద్దు. పోలవరంలో 45 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉంది.. దాని గురించి ఎప్పుడైనా హరీష్‌రావు, కేసీఆర్ మాట్లాడారా. తెలంగాణ నీటి వాటాల కోసం బీఆర్ఎస్ పోరాటం చేసినా దాఖలాలు ఎప్పుడూ లేవు. మిగులు జలాలపై ఉన్న ప్రేమ.. నికర జలాలపై హరీష్‌రావుకి ఎందుకు లేదు. తెలంగాణ నీళ్లను ఏపీకి పంపింది హరీష్‌రావే.. మళ్లీ ఆయనే అబద్ధాలు ఆడుతున్నాడు. మేము వాస్తవాలను అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నాం కాబట్టి వారికి నచ్చటం లేదు. మేము ఎవరి ప్రయోజనాల కోసమో కాకుండా.. తెలంగాణకు అన్యాయం జరగకుండా పోరాటం చేస్తాం. సీడబ్య్లూసీ ముందు అపెక్స్ కౌన్సిల్ ముందు మా వాదన వినిపిస్తాం. ప్రాజెక్ట్‌ల పేరిట బ్యాగుల మోసిన చరిత్ర బీఆర్ఎస్ నేతలది. వాసాలమర్రిలో బీఆర్ఎస్ చాలా మంది ఇళ్లను కూలగొట్టింది.. మేము వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం’ అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వరల్..
రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు బర్త్‌డే శుభాకాంక్షలు
భువనేశ్వరికి చంద్రబాబు బర్త్‌డే విషెస్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 20 , 2025 | 06:43 PM