Banakacharla Project: బనకచర్ల వివాదం.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసిన సీఎం రేవంత్
ABN, Publish Date - Jun 19 , 2025 | 12:39 PM
Banakacharla Project: డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడ్డుకోవడంతో పాటు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు నిలువరించాలని కేంద్రానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేయనున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 19: ఢిల్లీ కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో (Union Minister CR Patil) తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఈరోజు (గురువారం) భేటీ అయ్యారు. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌పై ఫిర్యాదు చేయనున్నారు. బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం (AP Govt) ముందుకు వెళ్లకుండా కట్టడి చేయాలని అని కోరనున్నారు. గోదావరి - బనకచర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజుబులిటీ రిపోర్టును తక్షణమే తిరస్కరించాల్సిందిగా కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడ్డుకోవడంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు నిలువరించాలని కేంద్రానికి తెలంగాణ సీఎం, మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేయనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి హాజరయ్యారు.
కాగా.. తొలి నుంచి కూడా గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తోంది. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రికి వివరించనున్నారు. ఇటీవల కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టును తిరస్కరించడంతో పాటు పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని, ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కొనసాగించవద్దని లేఖలో పేర్కొన్నారు. గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్‌ను తిరస్కరించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. నిన్న (బుధవారం) ఇదే విషయంపై సీఎం రేవంత్.. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వివిధ పార్టీల ఎంపీలతో చర్చించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే అవసరమైతే కోర్టులకైనా వెళ్లాలని.. న్యాయస్థానాల్లో పోరాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని నిన్నటి సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర పటేల్‌ను కలుస్తామని.. వారికి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేస్తామని, కచ్చితంగా ప్రాజెక్ట్‌ను అడ్డుకుని తీరుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా ఈరోజు జరుగుతున్న సమావేశంగా కీలకంగా మారింది.
నిన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా బనకచర్ల విషయంలో కేంద్ర జలశక్తి మంత్రి నుంచి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశారు. రెండు రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తామని కేంద్రమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు ఎక్కడా కూడా అన్యాయం జరగదని, మిగులు జలాలకు సంబంధించిన అంశాన్ని మాత్రమే తాము పరిశీలిస్తున్నామని.. మిగులు జలాలకు అనుగుణంగానే బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపడుతున్నామని చెబుతోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ పథకమని.. కేంద్రం వద్ద తీసుకోవాల్సిన అనుమతులను మాత్రమే తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
బ్రిటన్ మాజీ ప్రధానితో లోకేష్ భేటీ.. చర్చించిన అంశాలివే
ఓదార్పుకు కాదు.. యుద్ధానికి వెళ్లినట్టుంది.. జగన్‌పై కన్నా సెటైర్
Read latest AP News And Telugu News
Updated Date - Jun 19 , 2025 | 01:13 PM