ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rainfall: దంచి కొడుతున్న వానలు!

ABN, Publish Date - Jul 24 , 2025 | 03:15 AM

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

  • ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరులో 23.4, ములుగు జిల్లా వెంకటాపురంలో 23.1 సెం.మీ.

  • 12.30 గంటల వ్యవధిలోనే నమోదు

  • అంతకుముందు 24 గంటల్లో వెంకటాపురంలో 25.8 సెం.మీ.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం

  • ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

  • చేపలు పట్టేందుకు వెళ్లి ముగ్గురి గల్లంతు

  • పిడుగుపాటుకు ఒకరి మృతి

  • నేడు ఉత్తర తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు!

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగి రాకపోకలు స్తంభించగా.. పంటపొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలంలో అత్యధికంగా 23.4 సెం.మీ., ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 23.1 సెం.మీ. నమోదైంది. ఇటు మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు వెంకటాపురం మండలంలోనే 25.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం.. బుధవారం ములుగు జిల్లా మంగపేట మండలంలో 11.95 సెం.మీ., ఏటూరునాగారం మండలంలో 10.53 సెం.మీ, ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్‌లో 10.6, కౌటాలలో 10.3, భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 9.82 సెం.మీ., వికారాబాద్‌ జిల్లా చిట్టంపల్లిలో 8.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ ముసురు వాన పడింది. ములుగు జిల్లాలో పలు చోట్ల చెరువు కట్టలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోవిందరావుపేట మండలంలోని గుండ్లవాగు, జలగలంచవాగును పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పర్యాటకుల సందర్శనకు అధికారులు అనుమతి నిలిపేశారు. భారీ వర్షానికి కరీంనగర్‌లో రోడ్లన్నీ వాగుల్ని తలపించాయి. బెజ్జూరు మండలంలో కురిసిన వర్షానికి కృష్ణపల్లి-సోమిని గ్రామాల మధ్య ఉన్న లోలెవల్‌ వంతెన ఉప్పొంగి ప్రవహించడంతో అవతల ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాల నారచీరల ప్రాంతాన్ని గోదావరి వరద నీరు చుట్టుముట్టడంతో సీతమ్మ వారి విగ్రహంతోపాటు పరిసర లోతట్టు ప్రాంత దుకాణాలు నీట మునిగాయి. అలాగే పలు ప్రాంతాల్లో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా.. కొన్నిచోట్ల అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి ఓపెన్‌ కాస్టు గనుల్లో నిలిచిన ఉత్పత్తి కారణంగా రూ.3 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

చేపల వేటకు వెళ్లి ముగ్గురు గల్లంతు..

చేపల వేటకు వెళ్లి వేర్వేరు చోట్ల ముగ్గురు గల్లంతవ్వగా.. పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్‌ సాలే్‌హనగర్‌కు చెందిన సయ్యద్‌ సర్వర్‌ (55), తన తమ్ముడి కుమారుడు సయ్యద్‌ రిజ్వాన్‌(20), మహమ్మద్‌ ఇసాక్‌ (33)తో కలిసి తిమ్మాపూర్‌ మండలంలోని లోయర్‌ మానేర్‌ డ్యాం(ఎల్‌ఎండీ)లో చేపల వేటకు వెళ్లారు. ఈ సమయంలో సయ్యద్‌ రిజ్వాన్‌ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోగా.. కాపాడేందుకు పెద్దనాన్న సయ్యద్‌ సర్వర్‌ ప్రయత్నించి అతడితోపాటే నీటిలో మునిగిపోయాడు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం బూరుగుగుంపులో చేపలు పట్టేందుకు వెళ్లి నరేశ్‌ (30) వాగులో గల్లంతయ్యాడు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరుకు చెందిన తోటపల్లి వేణు (20) బైక్‌పై వెళ్తుండగా పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

శ్రీశైలం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల కొనసాగుతోంది. మంగళవారం ఒక గేటు తెరిచి నీటి విడుదల ప్రారంభించగా బుధవారం మరో గేటు ఎత్తి దిగువకు 54,956 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.20 లక్షల క్యూసెక్కులు నమోదవుతుండగా.. 1.45 లక్షల క్యూసెక్కులను స్పిల్‌వే, విద్యుదుత్పత్తి, పోతిరెడ్డిపాడు, ఎంజీకేఎల్‌ఐ, హంద్రీనీవా ద్వారా విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 1.21 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 5,174 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. కృష్ణాబేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టికి 44,054 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 25,640 క్యూసెక్కులను దిగువకు విడుస్తున్నారు. నారాయణపూర్‌కు 24,842 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 14,411 క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. జూరాలకు 67 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఔట్‌ఫ్లో 69,122 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్రకు 29,546 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 38,760 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు పైనుంచి భారీగా వరద వస్తుండటంతో.. 15 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 98,440 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. 85 గేట్లు ఎత్తి అంతేస్థాయిలో దిగువకు వదులుతున్నారు.

ఉత్తర తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు!

ఉత్తర తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రత్యేక వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. అక్కడక్కడ 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. అలాగే నిర్మల్‌ నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే ఈనెల 27వ తేదీ ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 03:15 AM