Mulugu; శ్రీధర్, సందీప్ కుటుంబాలను ఆదుకుంటాం
ABN, Publish Date - May 10 , 2025 | 05:20 AM
ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు, లంకపల్లి అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి చనిపోయిన కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన గ్రేహౌండ్ కానిస్టేబుల్ శ్రీధర్.
ప్రభుత్వం ప్రకటన.. అధికారికంగా అంత్యక్రియలు
పాల్గొన్న మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, స్పీకర్ ప్రసాద్
మాచారెడ్డి, ఘట్‌కేసర్, మే 9 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు, లంకపల్లి అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి చనిపోయిన కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన గ్రేహౌండ్ కానిస్టేబుల్ శ్రీధర్.. ఘట్‌కేసర్‌కు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ తిక్క సందీప్ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శ్రీధర్, సందీప్ అంత్యక్రియలు శుక్రవారం వారి వారి స్వస్థలాల్లో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. శ్రీధర్, సందీ్‌పకు గౌరవసూచకంగా పోలీసులు మూడుసార్లు గాల్లోకి తుపాకులను పేల్చారు. పాల్వంచలో జరిగిన శ్రీధర్ అంత్యక్రియల్లో ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుతో కలిసి మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌లో జరిగిన సందీప్ అంత్యక్రియల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ ఈటల పాల్గొన్నారు. సందీప్ చితికి తల్లి శోభ నిప్పంటించింది. శాంతి చర్చలు జరిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండగానే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. కాగా, మందుపాతర పేలి చనిపోయిన ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లికి చెందిన కానిస్టేబుల్ పవన్ కల్యాణ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో శుక్రవారం జరిగాయి.
రూ.కోటి పరిహారం: రేవంత్
మందుపాతర పేలి మృతి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లకు సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఒక్కో కానిేస్టబుల్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందిస్తుందని ప్రకటించారు. 300 గజాల ఇంటి స్థలం కేటాయించటంతో పాటు కుటుంబీకుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 10 , 2025 | 05:20 AM