Rythu Bharosa: శివారు మండలాల రైతులకు ‘భరోసా’ ఏదీ?
ABN, Publish Date - Jun 20 , 2025 | 03:47 AM
హైదరాబాద్ నగర శివార్లలోని మండలాల్లో రైతు భరోసా పంపిణీపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఈ 18 మండలాల్లో ఒక్క రైతు ఖాతాలో కూడా నిధులు జమ కాలేదు.
హైదరాబాద్ శివార్లలోని 18 మండలాల్లో నిలిపివేత.. సరైన కారణం చెప్పని అధికారులు
మంత్రి తుమ్మలను కలిసిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు
పరిశీలించి, న్యాయం చేస్తామన్న మంత్రి
రంగారెడ్డి జిల్లా/ఇబ్రహీంపట్నం/పటాన్‌చెరు/జిన్నారం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర శివార్లలోని మండలాల్లో రైతు భరోసా పంపిణీపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఈ 18 మండలాల్లో ఒక్క రైతు ఖాతాలో కూడా నిధులు జమ కాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా నిధులపై అధికారులెవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోవడం మరింత గందరగోళానికి దారితీస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, బాలాపూర్, రాజేంద్రపగర్, గండిపేట్, శేరిలింగంపల్లి మండలాల్లో రైతు భరోసా అందలేదు. శేరిలింగంపల్లి, బాలాపూర్, కుత్బుల్లాపూర్ మండలాల్లో తక్కువ వ్యవసాయ భూములు ఉండగా.. మిగతా మండలాల్లో ఎక్కువగానే ఉన్నాయి. మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్, దుండిగల్, కుత్బుల్లాపూర్, అల్వాల్, బాచుపల్లి, మేడిపల్లి మండలాల్లో రైతు భరోసా నిలిచిపోయింది. వానాకాలం సీజన్‌లో ఎకరానికి రూ.6 వేల చొప్పున పంటసాయం అందిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. కానీ, శివారు మండలాల రైతులకు ఇప్పటికీ అందకపోవడంతో స్థానిక నేతలను ఆశ్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 9 మండలాల్లో 48,184 ఎకరాల సాగు భూములకు గాను 36,220 మంది రైతులకు భరోసా నిధులు అందాల్సి ఉంది. మేడ్చల్ జిల్లాలో దాదాపు 45,103 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్న 40,443 మందికి దాదాపు రూ.24 కోట్ల నిధులు అందాల్సి ఉందని చెబుతున్నారు. శివార్లలో ‘రైతు భరోసా’ నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. నగర శివార్లలో వ్యవసాయ భూములన్నీ వ్యవసాయేతర భూములుగా మారుతున్నాయి. వేలాదిగా వెంచర్లు, కాలనీలు వస్తున్నాయి. ఈ క్రమంలో రైతు పెట్టుబడి సాయం పెద్దఎత్తున అన్యాక్రాంతమవుతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 76 వేల ఎకరాలను రైతుభరోసా ఇచ్చేందుకు అర్హత లేనివిగా తేల్చారు. ఈ మేరకు అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ పక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో శివారు మండలాల్లో రైతు భరోసా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. కానీ, అధికారులెవరూ ఈ విషయమై నోరువిప్పడం లేదు.
మంత్రి తుమ్మలను కలిసిన నేతలు
శివారు మండలాల్లో రైతు భరోసా నిలిపివేయడంపై ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టాయి. మరోవైపు ఈ వ్యవహారం క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నేతలకు కూడా తలనొప్పిగా మారింది. రైతు భరోసా నిలిపివేయడంపై మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గురువారం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ప్రభుత్వం కారణాలు చెప్పకుండా శివార్లలోని రైతులకు పెట్టుబడి సాయాన్ని నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తామని మంత్రి వారికి చెప్పారు. మేడ్చల్ జిల్లాలోని ఆయా మండలాల రైతులు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించి, కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరికి వినతిపత్రం అందజేశారు. రైతు భరోసా నిలిపివేయడం పట్ల బీజేపీ కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా మంత్రి తుమ్మలను కలిసి చర్చించారు. రైతు భరోసాపై ఆందోళన చెందవద్దని చెప్పారు.
రైతు భరోసాకు ‘ఔటర్ రింగ్ రోడు, ఎఫెక్ట్
పటాన్‌చెరు నియోజకవర్గంలోని జిన్నారం, పటాన్‌చెరు, అమీన్‌పూర్, రామచంద్రాపురం మండలాల రైతులకు భరోసా నిధులు జమకాలేదు. గుమ్మడిదల రైతులకు మాత్రం అందాయి. నాలుగు మండలాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నందున రైతు భరోసా నిధులు జమకాలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ మంత్రులు తుమ్మల, దామోదర దృష్టికి తీసుకెళ్లారు. పటాన్‌చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా అందజేయాలని మంత్రి తుమ్మల కలెక్టర్‌ను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ
యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
For More AP News and Telugu News
Updated Date - Jun 20 , 2025 | 03:47 AM