CM Revanth Reddy: మహిళల ఓట్లు మాకే
ABN, Publish Date - May 18 , 2025 | 03:35 AM
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మంది మహిళలు కాంగ్రె్‌సకు ఓటేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కోటి మంది ఆడపడచులు తమకే ఓటేస్తారని, వారి ఓట్లతో రెండోసారీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని అన్నారు.
మళ్లీ అధికారం మాదే.. కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్డులు
బడాబాబులు రుణాలు ఎగ్గొడుతున్నారు
మహిళలు క్రమశిక్షణతో తిరిగి చెల్లిస్తున్నారు
సహాయక సంఘాలకు రూ.లక్ష కోట్లు ఇస్తాం
ఆర్టీసీలో నడుపుకొనేందుకు మరో 600 బస్సులు
నియోజకవర్గ కేంద్రాలకూ వి-హబ్ విస్తరణ
నాలుగు జిల్లాల్లో ‘విమెన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’
వి-హబ్ స్టార్టప్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
డ్రగ్స్ కట్టడిలో రాష్ట్రానికి అవార్డుపై సీఎం హర్షం
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మంది మహిళలు కాంగ్రె్‌సకు ఓటేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కోటి మంది ఆడపడచులు తమకే ఓటేస్తారని, వారి ఓట్లతో రెండోసారీ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన విమెన్ ఆంత్రప్రెన్యూర్స్ హబ్ (వి-హబ్) రాష్ట్ర స్థాయి స్టార్టప్ సదస్సు శనివారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి.. వ్యాపార ఆలోచనలున్న మహిళలను ప్రోత్సహించే ‘విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం’, కళాశాలల్లో యువతుల కోసం ‘గ్రాస్ రూట్ యూత్ ఇన్నొవేషన్ ప్రోగ్రాం’లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ఇందిరాగాంధీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. సోనియాగాంధీ నేతృత్వంలో రెండుసార్లు యూపీఏ ప్రభుత్వం ఆర్టీఐ, ఆర్టీఏ, ఆహార భద్రత, ఉపాధి హామీ వంటి చరిత్రాత్మక పథకాలను ప్రారంభించింది. ఇందిర, సోనియా నేతృత్వంలో దేశం మహిళా సాధికారిత వైపు పరుగులు పెట్టింది. అందుకే రాష్ట్రంలోని మహిళలంతా కాంగ్రె్‌సకే మద్ద తు పలుకుతున్నారు. వారి ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది’’ అని అన్నారు. రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పిస్తుందని సీఎం చెప్పారు. వారికి యునిక్ నంబర్ గానీ, క్యూఆర్ కోడ్ గానీ ఉండే గుర్తింపు కార్డును జారీ చేసే విధానాన్ని అమల్లోకి తేవాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌ను ఆదేశించారు. ఆరోగ్య, ఆర్థికపరమైన వివరాలతో కూడిన డేటా బేస్ తయారు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, ప్రతి ఆరోగ్య పరీక్ష వివరాలను అందులో పొందుపరచాలన్నారు.
మహిళలకు మరో 600 బస్సులు..
తెలంగాణ ‘ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ’ను సాధించాలంటే రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని, ఆ లక్ష్య సాధనలో భాగంగానే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా ఒక్కో మహిళ నెలకు దాదాపు రూ.5వేల మేరకు ఆదా చేస్తున్నారని, ఆర్టీసీ కూడా లాభాల బాట పట్టిందని చెప్పారు. ‘‘ఆర్టీసీ ద్వారా నడుపుకోవడానికి మహిళా గ్రూపులకు ఇప్పటికే 150 బస్సులను కేటాయించాం. త్వరలో మరో 600 బస్సులను అందించనున్నాం. అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని కేటాయిస్తాం. పెద్ద కార్పొరేట్ సంస్థలే నిర్వహించే వ్యాపారాల్లో సైతం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి మహిళా సంఘాలను ప్రోత్సహించి రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా ఒప్పందాలు చేస్తున్నాం. హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో మహిళా సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యం కల్పించాం. ఇలా మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం’’ అని సీఎం రేవంత్ వివరించారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి రూ.17 లక్షల కోట్ల రుణాలను పలు కార్పొరేట్ సంస్థలు ఎగవేశాయని సీఎం తెలిపారు.
వారికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు. బడాబాబులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎగ్గొడుతుంటే.. రాష్ట్రంలోని మహిళా సంఘాలు ఎంతో క్రమశిక్షణతో రుణాలను తిరిగి చెల్లిస్తున్నారని ప్రశంసించారు. గతేడాది రూ.20 వేల కోట్ల మేరకు బ్యాంకుల నుంచి రుణాలు ఇస్తే.. ఒక్క రూపాయి ఎగవేయకుండా తిరిగి చెల్లించారని తెలిపారు. మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు బలంగా ఉన్నాయని, పట్టణ ప్రాంతాల్లో పెద్దఎత్తున సభ్యులను ఈ సంఘాల్లో చేర్పించా లన్నారు. వి-హబ్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నామని, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో వి-హబ్ ‘విమెన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ఇతర జిల్లాల్లోనూ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి సంజ య్ కుమార్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పరిశ్రమల శాఖ సంచాలకులు గుర్రం మల్సూర్, వి-హబ్ సీఈవో సీత పల్లచోళ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌తోపాటు 17సంస్థలతో వి-హబ్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 18 , 2025 | 05:52 AM