CM Revanth Reddy: హైదరాబాద్‌లో డేటా సిటీ
ABN, Publish Date - May 17 , 2025 | 03:11 AM
హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల హబ్‌గా హైదరాబాద్ దేశంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని, భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్‌గా మారబోతోందని తెలిపారు.
భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్
పెరిగే విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా ప్రణాళిక ఉండాలి
పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలి
ఫ్లోటింగ్ ప్లాంట్లు, ఔటర్ రింగ్ రోడ్డు, ఫుట్‌పాత్‌లు,
నాలాలపై సౌర విద్యుదుత్పత్తికి అవకాశాలను పరిశీలించండి
ఫ్యూచర్ సిటీలో స్తంభాలు, లైన్లు, టవర్లు బయటకు కనిపించొద్దు
జీహెచ్‌ఎంసీ పరిధిలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయండి
విద్యుత్తు శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల హబ్‌గా హైదరాబాద్ దేశంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని, భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్‌గా మారబోతోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో రాబోయే మూడేళ్లలో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరగనుందని, భవిష్యత్తు అవసరాలను ముందస్తుగా అంచనా వేసి, అందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి శుక్రవారం ఆయన విద్యుత్తు శాఖపై సమీక్ష చేశారు. ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్తు డిమాండ్ చేరుకుందని, 2025-26లో 18,138 మెగావాట్లకు; 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ‘‘గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్తు డిమాండ్ పెరిగింది.
గత ఏడాదితో పోలిస్తే 9.8 శాతం పెరిగింది. ఇది గొప్ప విజయం. అయినా, ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందించి ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తు అంచనాలు, అవసరాలకు తగినట్లుగా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలి. విద్యుదుత్పత్తిని పెంచుకోవాలి. ప్రధానంగా, క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు కేంద్రాలపై దృష్టిసారించాలి. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రానికి వెల్లువెత్తిన పెట్టుబడులు, రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి’’ అని నిర్దేశించారు. పరిశ్రమలతోపాటు గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, సాగునీటి ప్రాజెక్టులు, మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ (మెట్రో, ఎలక్ట్రిక్ వాహనాలు)ను దృష్టిలో ఉంచుకొని పునరుత్పాదక విద్యుత్తుపై దృష్టి సారించాలన్నారు. జలాశయాల్లో తేలియాడే సౌర విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలుపై దృష్టి సారించాలని సూచించారు.
విద్యుదుత్పత్తిలో ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లకు కావాల్సిన విద్యుత్తు అవసరాలపై హెచ్‌ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని విద్యుత్తు అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా సబ్ స్టేషన్లు అప్‌గ్రేడ్ చేసుకోవాలని, లైన్ల ఆధునీకరణపై దృష్టి సారించాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో విద్యుత్తు స్తంభాలు, టవర్లు, లైన్లు బయటకు కనిపించరాదని, పూర్తిగా భూగర్భంలోనే లైన్లు వేయాలని సూచించారు. హైటెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని, సచివాలయం, నెక్లెస్ రోడ్డు, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో ముందుగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. 160 కిలో మీటర్ల ఔటర్ పొడవునా సోలార్ విద్యుదుత్పత్తికి వీలుగా సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక ఉండాలని, జీహెచ్‌ఎంసీ పరిధిలోని పుట్‌పాత్‌లు, నాలాలపైనా సౌర విద్యుదుత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
హజ్ యాత్రను ప్రారంభించిన సీఎం
హైదరాబాద్ నుంచి మక్కాకు బయలుదేరిన హజ్ యాత్ర ప్రయాణికుల బస్సును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నాంపల్లి హజ్ హౌస్ నుంచి శుక్రవారం సాయంత్రం ఈ బస్సు విమానాశ్రయానికి బయలుదేరింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News
Updated Date - May 17 , 2025 | 03:12 AM