Kukatpally: మళ్లీ ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ!
ABN, Publish Date - Jun 16 , 2025 | 03:33 AM
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అల్ప, మధ్య, అధిక ఆదాయ వర్గాలకు కూడా అందుబాటు ధరల్లో ఇళ్లు అందించాలని భావిస్తోంది.
అల్ప, మధ్య, అధికాదాయ వర్గాలకూ ఇళ్లు?
హౌసింగ్ బోర్డు పరిధిలో నిర్మాణాలు
కూకట్‌పల్లిలో 80 ఎకరాల్లో అపార్ట్‌మెంట్లు!
ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ విభాగాలకు ఫ్లాట్లు
అక్కడే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకూ కొన్ని ఇళ్లు?
కసరత్తు చేస్తున్న గృహ నిర్మాణ శాఖ
సమగ్ర వివరాలతో ‘క్యాబినెట్’కు నివేదిక!
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అల్ప, మధ్య, అధిక ఆదాయ వర్గాలకు కూడా అందుబాటు ధరల్లో ఇళ్లు అందించాలని భావిస్తోంది. మళ్లీ ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ విభాగాల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు హౌసింగ్ బోర్డు పరిధిలో కూకట్‌పల్లిలో ఉన్న 80 ఎకరాల (అత్యంత ఖరీదైన స్థలం)లో అపార్ట్‌మెంట్లు నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అక్కడే కొంత భాగంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇచ్చేందుకు అపార్ట్‌మెంట్లనూ నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తం 80 ఎకరాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని నిర్మించాలి? ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ కేటగిరీల కోసం ఎన్ని నిర్మించాలనేదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమగ్ర నివేదికను రూపొందించి, క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు సమాచారం.
అందుబాటు ధరల్లో ఉండేలా..
అల్ప, మధ్య, అధిక ఆదాయ వర్గాల వారికీ సరసమైన ధరల్లో ఇళ్లను నిర్మించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అందుకోసం కొత్తగా ఒక విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ విధాన రూపకల్పన కోసం టెండర్లు ఆహ్వానించగా.. ఓ కంపెనీ దక్కించుకొని, హౌసింగ్ బోర్డు అధికారులకు సమగ్ర వివరాలతో నివేదికను అందించింది. ఆ విధానం ఆమోదయోగ్యంగా ఉందనుకుంటే.. దాని ప్రకారమే ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ విభాగాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడతారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్)- రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్య శాటిలైట్ టౌన్‌షి్‌పలను ఏర్పాటు చేయాలని, వీలైన చోట, స్థలం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏకంగా కొత్త గ్రామాలనే సృష్టించాలనే యోచనలో ఉంది. మొదటి దశలో ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల, అనంతరం వివిధ ప్రాంతాల్లో వీటిని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. తద్వారా ఇవన్నీ భవిష్యత్‌లో అఽధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలుగా మారతాయని సర్కారు యోచిస్తోంది. ఈ సందర్భంగా ఉమ్మడి ఏపీ హయాంలో నిర్మించిన కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు సహా ఇతర ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్ల నిర్మాణాలను పరిగణనలోకి తీసుకుంది. హైటెక్‌సిటీ నుంచి కూకట్‌పల్లి వెళ్లే మార్గంలో వేణుగోపాలస్వామి ఆలయం పక్కన బోర్డు పరిధిలో ఉన్న స్థలంలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని భావిస్తున్నారు. అయితే హౌసింగ్ బోర్డు, దిల్, ఇతర భూముల్లో ఏర్పాటు చేసే నిర్మాణాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) లేదా ఇతర ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని నిర్మించడం, లబ్ధిదారులతో వాటాలు పెట్టించడం ఇలా పలు అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం హౌసింగ్ బోర్డు పరిధిలో 598 ఎకరాలు, దిల్ పరిధిలో 1,821 ఎకరాల భూమి ఉంది. దిల్ పరిధిలోని భూమిలో 1000 ఎకరాల వరకు ఆక్రమణల్లోనే ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు.
సాధ్యమయ్యేనా..?
ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ వర్గాలకు సరసమైన ధరలకే ఇళ్లను అందించాలని నిర్ణయించినప్పటికీ ఇది సాధ్యమవుతుందా, పూర్తిస్థాయిలో ఈ పథకం విజయవంతం అవుతుందా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రాజీవ్ స్వగృహ టవర్లను పూర్తిచేయలేకపోవడాన్ని ఉదహరిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కూడా ఇంటిని నిర్మించుకునే వారికి ఆర్థిక సాయం చేయడం తప్ప.. ప్రభుత్వమే ఇంటిని నిర్మించడం లేదు. ఈ క్రమంలో మళ్లీ అందుబాటు ధరల్లో ఇళ్లు అందించాలన్న అంశాన్ని తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కూకట్‌పల్లిలో భూముల ధరలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఇటీవల హౌసింగ్‌బోర్డు పరిధిలో 18 ఓపెన్ ప్లాట్లను వేలం వేయగా.. సగటున గజం రూ.2.38 లక్షలు పలికింది. ఇప్పుడు అపార్ట్‌మెంట్లు నిర్మించాలనుకుంటున్న స్థలం ప్రధాన రహదారి పక్కనే ఉంది. ఆ స్థలం పక్కన, ఎదురుగా రెండు పెద్ద మాల్స్ ఉన్నాయి. అలాంటి స్థలంలో ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ కేటగిరీలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తే లాభదాయకంగా ఉంటుందా? అనేదానిపైనా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై నివేదికను రూపొందించి, క్యాబినెట్‌కు సమర్పించనున్నట్లు తెలిసింది.
ఉమ్మడి ఏపీలో 81 వేల ఇళ్ల నిర్మాణం
ఆదాయాల వారీగా ఆయా వర్గాల కోసం ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఉమ్మడి ఏపీలోనే మొదలైంది. ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ వర్గాలకు ఇళ్ల నిర్మాణాల కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంఏర్పడే వరకు 81,058 ఇళ్లు నిర్మించారు. వీటిలో అల్పాదాయ వర్గాల కోసమే దాదాపు 27,410 ఇళ్లను (250-400 చదరపు అడుగుల్లో) నిర్మించగా, ఎంఐజీ కింద (400-650 చ.అ.) 15,072; హెచ్‌ఐజీ కింద (800-1,400 చ.అ.) 4,320 ఇళ్లను నిర్మించారు. రాజీవ్ గృహకల్ప కింద కూడా ఎల్‌ఐజీ వర్గాల కోసం 27,652 ఇళ్లను నిర్మించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నీట్ యూజీ టాపర్లకు అభినందనలు తెలిపిన సీఎం
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..
For Telangana News And Telugu News
Updated Date - Jun 16 , 2025 | 03:33 AM