Air India Plane: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..
ABN , Publish Date - Jun 15 , 2025 | 03:39 PM
మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అధికారులు నిలిపివేశారు. ఆ క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 15: గుజరాత్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలి దగ్థమైన ఘటనలో దాదాపు 274 మంది మరణించారు. ఈ ఘటన మరువక ముందే మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఈ విమానం ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిపోయింది. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లవలసిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ క్రమంలో విమానాన్ని అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో నిలిపివేశారు. దీంతో ఈ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు.
అయితే ఈ విమానం బయలుదేరే ముందే ఈ విషయాన్ని పైలెట్ గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో విమానంలో సాంకేతిక లోపం ఎక్కడ తలెత్తిందనే అంశాన్ని నిపుణుల బృందం గుర్తించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ఘజియాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు వేచి ఉన్నారు. ఇక ఈ విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే విషయాన్ని మాత్రం అధికారులు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో వారంతా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టెకాఫ్ అయిన కొన్ని నిమిషాలకు కుప్పకూలి దగ్థమైంది. ఈ విమానం మెడికోల హాస్టల్‌పై కూలడంతో.. విమానంలోని ప్రయాణిస్తున్న 230 ప్రయాణికుల్లో ఒక్కరు మినహా మిగిలిన అందరు మరణించారు. అలాగే విమాన సిబ్బంది 12 మంది మృతి చెందారు. ఇక మెడికో హాస్టల్‌పై విమానం కూలడంతో 33 మంది మెడికోలు మరణించినట్లు సమాచారం. ఈ ఘటన కారణంగా ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలను సాంకేతిక బృందాలు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. ఇంకోవైపు విమాన ప్రయాణం చేయాలంటే పలువురు ప్రయాణికులు జంకుతున్నట్లు ఓ ప్రచారం అయితే సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మరోసారి బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. ఎందుకంటే..
19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: ఇస్రో
For National News And Telugu News