Hyderabad: పాడు బుద్ధి.. పోయే కాలం
ABN, Publish Date - Jun 20 , 2025 | 04:22 AM
వారంతా ఉన్నత చదువులు చదివిన వారు.. ఒకరైతే ఐఐటీ పట్టభద్రుడు.. అయినా, వారికి కనీస సంస్కారం లేకపోయింది. తమ స్థాయిని మరిచి, నీచంగా వ్యవహరించారు..
చిన్నారుల నగ్న వీడియోలు చూస్తున్న 15 మంది అరెస్టు
ఆన్‌లైన్‌లో చూడడంతోపాటు ఇతరులకూ షేరింగ్
నిందితులంతా విద్యాధికులే.. వారిలో ఐఐటీ పట్టభద్రుడూ..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అరెస్టు చేసిన పోలీసులు
అరెస్టయిన వారంతా 19 నుంచి 50 ఏళ్ల లోపువారే..
చైల్డ్ పోర్న్ వెతకడం, ఫార్వార్డ్ చేయడం నేరం
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): వారంతా ఉన్నత చదువులు చదివిన వారు.. ఒకరైతే ఐఐటీ పట్టభద్రుడు.. అయినా, వారికి కనీస సంస్కారం లేకపోయింది. తమ స్థాయిని మరిచి, నీచంగా వ్యవహరించారు! ఆన్‌లైన్‌లో చిన్నారుల నగ్న వీడియోలు చూస్తున్నారు! అంతేకాదు వాటిని డౌన్‌లోడ్ చేసుకొని, ఇతరులకు పంపుతున్నారు! ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్న 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీరిని అరెస్టు చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్ తెలిపారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ కేసు వివరాలను ఆమె మీడియాకు వెల్లడించారు. నిందితులంతా తరచూ ఈ చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తూ, ఇతరులకు పంపిస్తున్నారన్న విషయం తమ దృష్టికి రాగానే రాష్ట్రవ్యాప్తంగా 34 కేసులు నమోదు చేసి రంగంలో దిగామని తెలిపారు. బుఽధవారం తెలంగాణలోని వివిధ జిల్లాల పోలీసుల సహకారంతో ఏకకాలంలో దాడులు నిర్వహించామని ఆమె వివరించారు. హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా, కరీంనగర్, వరంగల్, జగిత్యాల, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు, రేప్, సామూహిక అత్యాచారం లాంటి ఫిర్యాదులను సమన్వయం చేయడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని ఆమె తెలిపారు. ఈ క్రమంలో బ్యూరోకి అనుబంధంగా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (సీపీయూ) ఏర్పాటు చేశామన్నారు.
ఈ సీపీయూ సిబ్బంది ఆన్‌లైన్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలను తరచూ చూస్తున్న వారిపై నిఘా పెడతారని, కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకుంటూ సమాచారాన్ని సేకరించి విశ్లేషించిన తర్వాత రంగంలోకి దిగుతారని, ఈ ఏడాది ఇప్పటి వరకు 294 కేసులు నమోదు చేసి 110 మందిని అరెస్టు చేశామని వివరించారు. తాజాగా అరెస్టు చేసిన 15 మందిపై వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 34 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. 15 మందికి 57 సైబర్ టిప్‌లైన్ ఫిర్యాదులతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. నిందితులంతా 19 నుంచి 50 ఏళ్లలోపు వారని, వీరిలో చాలామంది విద్యాధికులని చెప్పారు. వీరిలో ఐఐటీ పట్టభద్రుడు కూడా ఉన్నాడని షికా గోయల్ తెలిపారు. వీరు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేస్తున్న, చూస్తున్న వీడియోల్లో 6-14 ఏళ్ల మధ్య ఆడపిల్లల దృశ్యాలు ఉన్నాయని, ఇవన్నీ విదేశాలకు సంబంధించినవిగా గుర్తించామని చెప్పారు. ఆన్‌లైన్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్న 220 వెబ్‌సైట్లను బ్లాక్ చేశామన్నారు. ఆన్‌లైన్‌లో చైల్డ్ పోర్న్ గురించి వెతకడం, ఆ వీడియోలను ఇతరులకు పంపించడం నేరమని తెలిపారు. నిందితుల్లో చాలామంది డార్క్ వెబ్ ద్వారా వీటిని డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి హేయమైన నేరాలకు పాల్పడేవారికి శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని, విద్యాధికులైన యువత మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అరెస్టయిన వారిలో కొందరు పదికి పైగా నేరాల్లో బాధ్యులని, వారిని కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ
యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
For More AP News and Telugu News
Updated Date - Jun 20 , 2025 | 04:22 AM