Bumrah-Gill: బుమ్రా-గిల్ అదిరిపోయే స్కెచ్.. పసిగట్టే లోపే వేసేస్తారు!
ABN, Publish Date - Jun 16 , 2025 | 06:47 PM
టీమిండియా గెలుపు కోసం పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాతో కలసి స్కెచ్ వేస్తున్నాడట కెప్టెన్ శుబ్‌మన్ గిల్. ఇంగ్లండ్ బెండు తీసేందుకు భారీ ప్లాన్స్ రచిస్తున్నాడట. మరి.. ఆ స్కెచ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌కు జోరుగా సిద్ధమవుతోంది భారత జట్టు. 5 టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టు బెండు తీయాలని భావిస్తోంది టీమిండియా. ప్రతికూల పరిస్థితులు భయపెడుతున్నా తగ్గేదేలే అని అంటోంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో గంటల కొద్దీ శ్రమిస్తున్న మెన్ ఇన్ బ్లూ.. ప్రత్యర్థి జట్టును వదలొద్దనే పంతంతో కనిపిస్తోంది. ఈ తరుణంలో పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాతో కలసి అదిరిపోయే స్కెచ్ వేస్తున్నాడట కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్. ఇంగ్లండ్ పసిగట్టే లోపే వేసేయాలని చూస్తున్నాడట. మరి.. గిల్ వ్యూహం ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..
నో క్లారిటీ..
ఐపీఎల్‌కు ముందు వరకు గాయంతో బాధపడిన బుమ్రా.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ టోర్నీలో అదరగొట్టిన ఏస్ పేసర్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో దుమ్మురేపాలని చూస్తున్నాడు. పేస్, స్వింగ్.. ఇలా తన బౌలింగ్‌కు బాగా నప్పే కండీషన్స్‌లో ఆతిథ్య జట్టు బెండు తీయాలని అనుకుంటున్నాడు. అయితే పూర్తిగా కోలుకోనందున బుమ్రా ఎన్ని మ్యాచులు ఆడతాడో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అతడు 3 టెస్టులే ఆడతాడని సెలెక్టర్లు చెప్పినా.. ఆ మూడు టెస్టులు ఏవో క్లారిటీ ఇవ్వలేదు. హెడ్ కోచ్ గౌతం గంభీర్ కూడా బుమ్రా ఏయే మ్యాచుల్లో ఆడతాడో బయటపెట్టడం లేదు.
మొత్తం సిరీస్‌కు..
బుమ్రా 2 లేదా 3 కంటే ఎక్కువ టెస్టుల్లో ఆడబోడని భారత క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. కానీ గిల్ ప్లానింగ్ మరోలా ఉందట. జట్టుకు అవసరమైన సమయంలోనే అతడ్ని బౌలింగ్‌కు దించాలని ప్లాన్ చేస్తున్నాడట. వికెట్లు కావాల్సిన దశలో, ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాల్సిన సమయంలోనే బుమ్రా చేతికి బంతి ఇవ్వాలని భావిస్తున్నాడట. జస్‌ప్రీత్ ఎప్పుడెప్పుడు బౌలింగ్‌కు దిగుతాడా? అనే ఆలోచనలతో ఇంగ్లండ్‌ను వెయిటింగ్‌లో ఉంచి.. హఠాత్తుగా అతడ్ని దింపి షాక్ ఇవ్వాలని చూస్తున్నాడట. అంతేకాదు.. ఒక్కో మ్యాచ్‌కు అవసరమైనప్పుడే వాడుకుంటూ మొత్తం సిరీస్ అతడి సేవలు వినియోగించుకోవాలని గిల్ ఆలోచనలు చేస్తున్నాడట. దీనికి బుమ్రా ఓకే చెప్పాడని.. ఫిట్‌నెస్ విషయంలో ఇబ్బందులు రానంత వరకు ఈ విషయంలో వెనుకాడేది లేదని మాట ఇచ్చాడని తెలుస్తోంది. ఈ ప్లాన్ గనుక వర్కౌట్ అయితే ఇంగ్లండ్‌కు దబిడిదిబిడేనని నెటిజన్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 16 , 2025 | 06:47 PM