India vs England: గెలిపించాల్సింది అతడే.. ఈ లాజిక్ వర్కౌట్ అవుతుందా?
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:50 PM
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా.. ఇంకొన్ని సెషన్లు బాగా ఆడితే మ్యాచ్‌పై పూర్తిగా పట్టు సాధించొచ్చు. దీనికి అతడు రాణించడమే కీలకమని విశ్లేషకులు అంటున్నారు.
పీడకలగా చెప్పుకునే ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి గెలుపును రుచి చూడాలని అనుకుంటోంది టీమిండియా. ఈ దిశగా భారీ అడుగులు పడ్డాయి. ఇక్కడ ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇతర బ్యాటర్లు కూడా రాణించడంతో కొండంత స్కోరు చేసింది మెన్ ఇన్ బ్లూ. అలాగే తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య జట్టును తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది. తొలి రోజు ముగిసేసరికి 3 వికెట్లకు 77 పరుగులతో ఉంది ఇంగ్లండ్. దీంతో మూడో రోజు ఏం అవుతుంది? మన బౌలర్లు మరింత చెలరేగుతారా? అని అంతా ఆలోచనల్లో పడ్డారు. ముఖ్యంగా ఆ ఒక్కడి మీదే అంతా ఫోకస్ చేస్తున్నారు. ముంచినా.. తేల్చినా అతడే అంటున్నారు.
అతడి చుట్టూనే..
రెండో రోజు సాయంత్రం ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇద్దరూ కట్టుదిట్టంగా బంతులు వేసి 3 వికెట్లు పడగొట్టారు. మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ బ్రేక్‌త్రూ ఇవ్వలేకపోయాడు. అయితే మూడో రోజు అతడి చుట్టూనే ఆట నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీడ్స్ టెస్ట్‌లో ప్రసిద్ధ్ వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అది జట్టుకు బిగ్ మైనస్‌గా మారింది. ఇవాళ కూడా అతడ్నే రూట్, స్టోక్స్, బ్రూక్ లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లు ఆడే చాన్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ్ గానీ చెలరేగకపోతే టీమిండియాకు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే అంటున్నాడు.
దూకుడు మంత్రంతో..
ప్రసిద్ధ్‌తో దూకుడుగా బౌలింగ్ చేయించాలని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మిగతా పేసర్లతో కట్టుదిట్టంగా స్పెల్స్ వేయిస్తూ.. మరోవైపు నుంచి అతడితో అటాక్ చేయించాలని అంటున్నారు. అతడు గానీ చెలరేగితే ఇంగ్లండ్‌కు దబిడిదిబిడేనని చెబుతున్నారు. ‘ప్లేయింగ్ ఎలెవన్‌ను మార్చడం కరెక్టా.. కాదా.. అనేది మ్యాచ్ పూర్తయితే గానీ చెప్పలేం. 20 వికెట్లు తీస్తే అంతకంటే ఏం కావాలి. ఆకాశ్‌దీప్ స్టంప్స్‌ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేయడం బాగుంది. సిరాజ్ మరో ఎండ్ నుంచి తన పని తాను చేసుకుపోతున్నాడు. సమస్యల్లా ప్రసిద్ధ్‌తోనే. అతడు మంచి బౌలరే. కానీ సుదీర్ఘ స్పెల్స్‌లో నియంత్రణతో బౌలింగ్ చేయగలడా అనేది చూడాలి. ఒకవేళ అతడు నిలకడగా ఒకే ఏరియాలో బంతులు వేస్తూ పోతే భారత్‌ను ఆపడం కష్టమే. మిగిలిన పని పూర్తి చేసేందుకు స్పిన్నర్లు ఎలాగూ ఉన్నారు’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన గిల్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 04 , 2025 | 12:55 PM