Share News

Shubman Gill Success Secret: సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన గిల్.. ఇంత కథ దాగి ఉందా?

ABN , Publish Date - Jul 04 , 2025 | 09:30 AM

టీమిండియా నూతన సారథి శుబ్‌మన్ గిల్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడో లేదో అతడి బ్యాట్ ఓ రేంజ్‌లో గర్జిస్తోంది.

Shubman Gill Success Secret: సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన గిల్.. ఇంత కథ దాగి ఉందా?
Shubman Gill

కెప్టెన్సీని చాలా మంది ఆటగాళ్లు బాధ్యతగానే కాదు ఒత్తిడిగానూ చూస్తారు. ఆ పోస్ట్‌లోకి వస్తే తమ ఆటతీరు ఎక్కడ దెబ్బతింటుందోనని భయపడతారు. అభిమానుల అంచనాలను అందుకోకపోతే విమర్శల బారిన పడాల్సి వస్తుందని టెన్షన్ పడతారు. అందుకే సారథ్య పగ్గాలు తీసుకోవడానికి చాలా మంది స్టార్లు వెనుకంజ వేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఆ పోస్ట్‌లోకి వచ్చాక మరింత చెలరేగి ఆడుతుంటారు. టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అదే పని చేస్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో సాదాసీదా బ్యాటర్‌గా ఉన్న గిల్.. సారథిగా చార్జ్ తీసుకున్నాక తొలి పర్యటన అయిన ఇంగ్లండ్‌లో విజృంభించి ఆడుతున్నాడు. లీడ్స్ టెస్ట్‌లో శతకం బాదిన 25 ఏళ్ల యువ ఆటగాడు.. ఎడ్జ్‌బాస్టన్‌లో ద్విశతకంతో చరిత్ర సృష్టించాడు.


ఐపీఎల్‌లోనే షురూ..

రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 387 బంతుల్లో 269 పరుగుల అద్వితీయ ఇన్నింగ్స్‌తో అందరి మనుసులు దోచుకున్నాడు గిల్. పట్టుదల, క్రమశిక్షణ, ఓపికతో అతడు ఆడిన తీరు.. ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన విధానం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ నాక్ వెనుక గల కష్టాన్ని బయటపెట్టాడు గిల్. అందరూ ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న సమయంలో తాను ఈ టూర్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టానని అతడు తెలిపాడు. సిరీస్ కోసం బాగా సన్నద్ధమై వచ్చానని చెప్పాడు. అది తనకు బిగ్ ప్లస్ అయిందన్నాడు గిల్.


అదే ముఖ్యం..

‘ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఐపీఎల్ సమయంలోనే నేను ప్రాక్టీస్ షురూ చేశా. గత మ్యాచుల్లో నేను పరుగులు చేసినా ఏకాగ్రతతో ఆడలేదనే విషయాన్ని అర్థం చేసుకున్నా. అందుకే ప్రాథమిక విషయాల మీదే దృష్టి పెట్టా. భారీగా పరుగులు చేయాలనే దృక్పథంతో కాకుండా నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాలి అనుకొనే ఆడుతూ పోయా. పరుగులు చేయాలనే ఆలోచనతో ఆడితే బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయలేం. అందుకే ఆటను ఆస్వాదిస్తూ ఇన్నింగ్స్ కొనసాగించా. టీ20లకు టెస్ట్ బ్యాటింగ్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పొట్టి ఫార్మాట్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు సమయం పడుతుంది. అందుకే ఐపీఎల్‌లోనే సన్నాహకాలు మొదలుపెట్టా’ అని గిల్ చెప్పుకొచ్చాడు.


ఇవీ చదవండి:

గాఫ్‌కు ఝలక్‌

కార్ల్‌సన్‌కు గుకేష్‌ షాక్‌

పాక్‌ హాకీ జట్లకు గ్రీన్‌సిగ్నల్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 09:32 AM