Cockroach: అణుబాంబు రేడియేషన్‌ను తట్టుకునే జీవి ఏదో తెలిస్తే..
ABN, Publish Date - May 12 , 2025 | 11:24 PM
అణుబాంబు రేడియేషన్‌ను తట్టుకుని నిలబడగలిగే జీవి బొద్దింక అని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా అణ్వాయుధ ప్రయోగం తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అణు యుద్ధం అంటే మామూలు విషయం కాదు.. యావత్ మానవజాతికే ఇది ముప్పు. అందుకే రెండు అణ్వాయుధ దేశాలు తలపడుతున్నాయంటే ప్రపంచ దేశాలు వణికిపోతాయి. అయితే, అణ్వాయుధ రేడియో ధార్మికతను కూడా తట్టుకుని నిలబడే జీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. హిరోషిమా, నాగసాకీపై అణుబాంబు ప్రయోగం తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అణుబాంబు ప్రయోగించిన తరువాత ఆ రెండు జపాన్ నగరాల్లో దాదాపుగా జీవజాలం తుడిచిపెట్టుకుపోయింది. అయితే, బొద్దింకలు మాత్రం బతికే ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. దీంతో, వారు ఈ రహస్యం ఏంటో తెలుసుకునేందుకు పలు పరిశోధనలు చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అణుబాంబు ప్రభావం నుంచి అవి ఎలా తప్పించుకోగలిగాయో గుర్తించారు.
బొద్దింకలు మనుషుల కంటే ముందే భూమ్మీద ఉనికిలోకి వచ్చాయి. మానవజాతి 100 రెట్లు ఎక్కువ సమయం నుంచే ఇవి భూమి మీద తిరుగాడుతున్నాయి. గడ్డుపరిస్థితులను కూడా తట్టుకుని బతకడానికి వాటి శరీర నిర్మాణమే కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. బొద్దింక తల తెగి పడిన తరువాత కూడా అవి వారాల పాటు బతికే ఉంటాయి. శరీరం మీద ఉన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటూ జీవిస్తాయి. అణురేడియేషన్‌ను తట్టుకునే సామర్థ్యం వీటికి అపారం. ఫలితంగా అనేక జీవులు మనలేని చోట కూడా ఇవి హ్యాపీగా బతికేస్తాయి.
ఈ భూమ్మీద మొత్తం నాలుగు వేల రకాల బొద్దింకల జాతులు ఉన్నాయి. అయితే, కేవలం 30 జాతుల బొద్దింకలు మాత్రమే మనుషుల ఆవాసాలకు సమీపంలో నివసిస్తుంటాయి. వీటి వల్ల టైఫాయిడ్, సాల్మొనెల్లా, ట్యూబరిక్యులోసిస్ వంటి వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి, బొద్దింకలతో ప్రజారోగ్యంపై భారీ ప్రభావం ఉంటుంది. ఇవి రాత్రి సమయాల్లో మాత్రమే బయటకు వస్తాయి. పగటి పూట అవి భూమిపొరల్లో దాక్కుని అత్యంత కఠిన పరిస్థితులను కూడ తప్పించుకుని నిలబడతాయి. వీటిల్లో కణవిభజన చాలా తక్కువగా ఉండటం, శరీర నిర్మాణం చాలా సింపుల్‌గా ఉండటం తదితర కారణాలు వీటికి రేడియేషన్‌ను తట్టుకునే శక్తిని ఇస్తాయి. ఇలా పలు రకాల కారణాల వల్ల బొద్దింకలు అణు రేడియేషన్ ను కూడా తట్టుకుని బతకగలవని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
13 గంటల పాటు పని చేసిన యువ టెకీకి ఘోర అవమానం
కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా
ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ
భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు
Updated Date - May 13 , 2025 | 11:35 AM