Indians Be More Polite: భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు
ABN , Publish Date - May 05 , 2025 | 09:26 PM
భారతీయులు కాస్త మర్యాద నేర్చుకోవాలంటూ ఓ కెనడా పౌరుడు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఉంటున్న ఓ కెనడా వ్యక్తి ఇక్కడి వారికి చేసిన సూచన ప్రస్తుతం వైరల్‌గా మారింది. భారతీయులు కాస్తంత మర్యాద నేర్చుకోవాలంటూ అతడు తన వీడియోలో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా, ఇక్కడి వారికి ఓ ఛాలెంజ్ కూడా విసిరాడు.
భారతీయులు మరింత మర్యాదగా ప్రవర్తించడం తెలుసుకోవాలని కెనడా పౌరుడు కేలబ్ ఫ్రీసెన్ అన్నాడు. ఓ ఛాలెంజ్ కూడా విసిరాడు. ఒకే రోజులో తను చెప్పినవన్నీ చేసిన వారు తనను సంప్రదించొచ్చని కూడా అన్నాడు. ‘‘భారతీయులారా.. కాస్తంత మర్యాదగా నడుచుకోండి. డెలివరీ ఏజెంట్లు, కిరాణా షాపు వాళ్లకు థాంక్యూ చెప్పండి. డ్రైవర్లు, వెయిటర్లపై అరవడం మానుకోండి. అపరిచితులు కనిపించినా కూడా వారి కళ్లల్లోకి సూటిగా చూసి.. మర్యాదపూర్వకంగా ఓ చిరు నవ్వు నవ్వండి. ఇక క్యూల్లో నిలబడ్డప్పుడు ఓర్పుతో ఉండండి.. ఒకరినొకరు తోసుకోకండి. ఇలాంటి పనులకు పైసా కూడా ఖర్చు కాదు. కానీ సమాజంలో ఓ సానుకూల వాతావరణం నెలకొంటుంది’’ అని చెప్పుకొచ్చాడు.
ఈ వీడియోపై సహజంగానే భారతీయులు పెద్ద ఎత్తున స్పందించారు. ‘‘కొన్నేళ్ళ పాటు విదేశాల్లోనే చదువుకున్నా.. బస్ డ్రైవర్లకు, సూపర్ మార్కెట్ ఉద్యోగులకు ధన్యవాదాలు చెప్పడం నాకు ఒక అలవాటుగా మారింది. కానీ ఇండియాలో ఇలా చేస్తే కొందరు నన్ను వింతగా చూశారు. ఎవరి పని వాళ్లు చేసినందుకు ధన్యవాదాలు ఎందుకు చెప్పాలని నన్ను ప్రశ్నించారు’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.
‘‘ఈ ఛాలెంజ్ ముందుగా టీచర్లకు, తల్లిదండ్రులకు ఇవ్వాలి. అప్పుడే వారు తమ పిల్లలకు మంచి ప్రవర్తన నేర్పించగలుగుతారు’’ అని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. తాము చిన్నప్పటి నుంచీ ఇలాగే చేస్తున్నామని కొందరు చెప్పుకొచ్చారు. ఇక్కడ అసలు సమస్య జనాల్లో సహనం లేకపోవడమేనని కొందరు అన్నారు. సహనం లేని కారణంగా వాహనదారులు తీవ్రస్థాయిలో రూడ్లపై గొడవపతుంటారని, హారన్‌లు కొడుతూ ఇబ్బంది కలుగజేస్తారని తెలిపారు. కొందరు మాత్రం కేలబ్‌పై విమర్శలు గుప్పించారు. అవతలి వారిని లోకువ కట్టేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..
మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..
అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు