WFH or Leave: వాన పడుతోందని వర్క్ ఫ్రమ్ హోం అడిగిన ఉద్యోగి.. చివరకు జరిగిందంటే..
ABN , Publish Date - May 02 , 2025 | 08:12 PM
వాన పడుతున్నందుకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని కోరినా మేనేజర్ అనుమతించకపోవడంతో ఓ యువ ఉద్యోగి మరో ఆలోచన లేకుండా మరుసటి రోజు సెలవు పెట్టేశాడు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసుల్లో ఉద్యోగులు సెలవులు అడగడం.. బాస్‌లు ఏదో కారణం చెప్పి కాదనడం మామూలే. అయితే, సెలవుల కోసం ఉద్యోగులు చెప్పే కారణాలే హైలైట్‌గా నిలుస్తుంటాయి. ఇందుకు సంబంధించి మరో ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వాన పడుతోందని ఉద్యోగి వర్క్ ఫ్రం హోం కోరడం.. బాస్ నిరాకరించడం.. ఆ తరువాత జరిగిన పరిణామాలు జనాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఢిల్లీలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
తన సహోద్యోగికి, బాస్‌కు మధ్య జరిగిన సంవాదాన్ని మరో వ్యక్తి నెట్టింట పంచుకున్నాడు. ఇటీవల ఢిల్లీలో భారీ వర్షాల సందర్భంగా ఈ ఘటన జరిగినట్టు అతడు చెప్పుకొచ్చాడు. అతడు తెలిపిన వివరాల ప్రకారం, భారీ వర్షం కురుస్తున్న కారణంగా సదరు జూనియర్ ఉద్యోగి ఆఫీసుకు రాలేనని మేనేజర్‌కు తెలిపాడు. వర్క్ ఫ్రమ్ హోంను అనుమతించాలని కోరాడు. కానీ బాస్ మాత్రం ఇందుకు నిరాకరించాడు. ఆఫీసుకు రావాల్సిందేనని, అవసరమైతే సర్జ్ ప్రైసింగ్ ఎంచుకుని, క్యాబ్‌కు అధిక ధర చెల్లించి ఆఫీసుకు రావాలని సూచించాడు. అయితే, సదరు జూనియర్ మాత్రం ఆఫీసుకు రాలేనని ఖరాఖండీగా చెప్పేశాడు.
క్యాబ్‌కు చెల్లించాల్సిన అధిక ధర తన ఒక రోజు జీతం కంటే ఎక్కువ ఉంటుందని నిర్మొహమాటంగా చెప్పేశాడు. దీంతో, షాకైపోవడం బాస్ వంతైంది. ఓ జూనియర్ ఉద్యోగి అలాంటి సమాధానం ఇస్తాడని ఊహించలేక షాకైపోయాడు. అయితే, సదరు జూనియర్ ఉద్యోగి మరుసటి రోజు ఆఫీసుకు రాలేదు. దీంతో, రెండో రోజు మీటింగ్‌కు హాజరు కావాలని మేనేజర్ కబురు పంపాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది తెలియకపోయినప్పటికీ ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఈ ఘటనపై జనాలు తమ అభిప్రాయాలు అనేకం వెలిబుచ్చారు. ఉద్యోగుల హక్కులు, సాధకబాధకాలు, మేనేజర్ల మొండితనం, తదితర అంశాలపై చర్చ మళ్లింది. ఇక తరం మారిందని కూడా కొందరు చెబుతున్నారు. ఉద్యోగ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్న నేటి యువత తమకు కావాల్సినవి నిర్మొహమాటంగా అడిగి తీసుకొంటున్నారని, ఎటువంటి అనవసర మొహమాటాలూ ప్రదర్శించట్లేదని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.
ఇవి కూడా చదవండి:
సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై పాక్ ప్రజలు ఏమంటున్నారంటే..
మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..
అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు