Share News

Pak Citizens On Tensions with India: సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై పాక్ ప్రజలు ఏమంటున్నారంటే..

ABN , Publish Date - Apr 26 , 2025 | 08:27 AM

కనీస అవసరాలు కూడా తీర్చలేని తమ ప్రభుత్వంతో విసిగిపోయిన పాక్ ప్రజలు భారత్‌తో యుద్ధాన్ని లైట్ తీసుకుంటున్నారు. యుద్ధం జరిగినా తమకు కొత్తగా జరిగే నష్టం ఏముంటుందంటూ నెట్టింట సెటైర్లు పేలుస్తున్నారు.

Pak Citizens On Tensions with India: సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై పాక్ ప్రజలు ఏమంటున్నారంటే..
Pak Citizens On Tensions with India

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి తరువాత భారత్ తీసుకున్న కఠిన చర్యలకు పాక్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలతో ఎండగట్టుకుపోవడం పక్కా అని పాక్ వణికిపోతోంది. భారత్‌ ఎప్పుడైనా దాడి చేయొచ్చనే ఆందోళనతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అయితే, ఇది సోషల్ మీడియా జమానా కాబట్టి పాక్ ప్రజలు ఈ ఉద్రిక్తతలపై పెద్ద ఎత్తున ఆన్‌లైన్‌లో స్పందిస్తున్నారు. స్వయంకృతాపరాథానికి పాల్పడ్డ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. పాక్ ఆర్థిక, వ్యవసాయ రంగానికి వెన్నెముకగా ఉన్న సింధు నదీ జలాల నిలుపుదలపై జనాల ట్రోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం పాక్ సాగునీటి అవసరాల్లో 80 శాతాన్ని సింధు నదీ జలాలే తీరుస్తున్నాయి. జల విద్యుత్‌లో 30 శాతం ఈ నీటి ద్వారానే అందుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఓ రేంజ్‌లో తలంటేస్తున్నారు.


ఇక స్నానానికి నీళ్లు కావాలన్నా భారత్‌ను అభ్యర్థించాలంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశారు. స్నానం చేస్తుండగా మధ్యలో నీరు ఆగిపోయి జనాలు అగచాట్లు పాలుకావొచ్చంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ‘‘ప్రపంచంలో సగం దేశాల వద్ద అప్పులు తెచ్చుకున్నాం. కాబట్టి, ఇలాంటి దేశంపై భారత్ దాడి చేస్తుందని అనుకోను. అందరూ హ్యాపీగా నిద్రపోండి’’ అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ‘‘భారత్‌ పాక్‌ను ఆక్రమిస్తే ఇక్కడి ప్రభుత్వానికి ఈ అప్పుల పీడ తప్పుతుంది. కొత్త అప్పులు అడుక్కోవాల్సిన అగత్యం ఉండదు. అందుకే భారత్‌ను రెచ్చగొడుతోంది’’ అని తుంటరి కామెంట్స్ చేశారు.


‘‘కరాచీలో భారీ శబ్దం.. ఒక్కసారిగా చిమ్మ చీకట్లు.. యుద్ధం మొదలైందనే అనుకున్నా.. కానీ, ట్రాన్స్‌ఫార్మర్ పేలినట్టు తరువాత తెలిసింది.. ఇక్కడ ఇది రోజూ జరిగేదే’’ అని మరో వ్యక్తి అన్నాడు. పాక్‌లో కరెంట్ కోతలు నిత్య కృత్యంగా మారాయి. కొన్నేళ్లుగా పాక్‌లో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందనేందుకు ఈ మీమ్స్ అద్దంపడుతున్నాయి. ఎలాంటి పేద దేశంతో భారత్ యుద్ధానికి దిగుతోందో వాళ్లకు అర్థం కావట్లేదు అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. భద్రతా కారణాల రీత్యా భారత్ పాక్ యుద్ధం కూడా క్రికెట్ మ్యాచ్‌లాగే దుబాయ్‌లో జరగాలి అని మరో వ్యక్తి సెటైర్ పేల్చాడు. ప్రభుత్వం అసమర్థతో ఇప్పటికే తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న పాక్ ప్రజలకు భారత్‌తో జరిగే యుద్ధంతో కొత్తగా వచ్చే నష్టమేమీ లేదని కొందరు కామెంట్ చేశారు. ఇలా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దశలో ఉన్న పాక్ ప్రజలు చివరకు తమ విషాదాన్ని మీమ్స్‌గా మార్చి నెట్టింట హోరెత్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

పరీక్షల్లో కాపీ కొట్టేందుకు హెల్ప్ చేసే ఏఐ.. ఇలాంటి ఎక్కడా చూసుండరు

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

Read Latest and Viral News

Updated Date - Apr 26 , 2025 | 08:54 AM