Techie Humiliated: 13 గంటల పాటు పని చేసిన యువ టెకీకి ఘోర అవమానం
ABN , Publish Date - May 12 , 2025 | 10:53 PM
తనను తాను నిరూపించుకునేందుకు ఓ యువ టెకీ 13 గంటల పాటు ఏకబిగిన పనిచేసి సమస్య పరిష్కరిస్తే చివరకు ఘోర అవమానం జరిగింది. బాధిత టెకీ నెట్టింట పంచుకున్న ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అతడో యువ ఇంజినీర్. కొత్త జాబ్‌లో చేరాడు. తన టాలెంట్ నిరూపించుకోవాలని అనుకున్నాడు. ఏదో సమస్య వస్తే ఏకంగా 13 గంటల పాటు ఆఫీసులోనే గడిపాడు. ఎట్టకేలకు సమస్యను పరిష్కరించాడు. గర్వంగా ఫీలయ్యాడు. కానీ మరుసటి రోజు మాత్రం అతడి మేనేజర్ చెడామడా తిట్టేశాడు. ఇంత లేటుగా పని పూర్తి చేస్తావా అంటూ మండిపడ్డాడు. ఘోర అవమానం జరగడంతో తట్టుకోలేకపోయిన అతడు చివరకు తన బాధను నెట్టింట పంచుకున్నాడు. ఇంత కష్టపడితే చివరకు ఏమి మిగిలిందంటూ నైరాశ్యం వ్యక్తం చేశాడు.
‘‘అందరి ముందూ మా మేనేజర్ నన్ను తిట్టేశాడు. చాలా స్లోగా పని చేస్తున్నానని అన్నాడు. నాకు ఇది అవమానంగా అనిపించింది. నన్ను గైడ్ చేయాల్సిన సీనియర్ కూడా అబద్ధాలు చెప్పి తప్పించుకున్నాడు. నెపం నాపై పెట్టి సైడైపోయాడు. సమస్య పరిష్కారంలో జాప్యం జరగడానికి కొన్ని ఫైల్స్ మిస్సవ్వడమే కారణం. దానిని నేను బాధ్యుడిని కాను. కానీ నెపం మాత్రం నాపై పడింది. తప్పంతా నాదే అని నా మెంటార్ అబద్ధమాడాడు. నన్ను బలిపశువును చేశాడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కాన్ఫిడెన్స్ మొత్తం తగ్గిపోయిందని అన్నాడు.
దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఆఫీసు పాలిటిక్స్ గురించి ఇదో గుణపాఠంగా భావించాలని అనేక మంది చెప్పుకొచ్చారు. కార్పొరేట్ ప్రపంచంలో ఎదిగే క్రమంలో ఇలాంటి సమస్యలు తప్పవని అన్నారు. ‘‘నీ పని గురించి ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండకూడదు. మేనేజ్‌మెంట్ ఎదురుగా ఉన్నా సరే నీ వాదన బలంగా వినిపించాలి’’ అని ఓ వ్యక్తి సలహా ఇచ్చారు. ఇలాంటి సందర్భాల్లో ఆదుకునేది డాక్యుమెంటేషన్ అని మరొకరు తెలిపారు. సహోద్యోగులు, పైస్థాయి అధికారులతో జరిపిన చర్యల గురించి అన్ని ఆధారాలు సిద్ధంగా పెట్టుకోవాలని, లేకపోతే చేయని తప్పునకు నిందలు మోయాల్సి వస్తుందని తెలిపారు. ఇలాంటి అనుభవాలు అతడిని రాటుదేలుస్తాయని కొందరు అన్నారు. ఈ అనుభవమే భవిష్యత్తులో ఆయుధంగా మారి అతడి కెరీర్‌కు మేలు చేస్తుందని తెలిపారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా
ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ
భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు