Miss World 2025: భాగ్యనగరానికి తరలివస్తున్న అందాలభామలు.. అధికారుల సాదర ఆహ్వానం..
ABN, Publish Date - May 05 , 2025 | 07:05 PM
Hyderabad Miss World 2025: మే 10వ తేదీ నుంచి తెలంగాణలో తొలిసారి జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నిర్వహణకు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరో పక్క దేశ విదేశాల నుంచి అందాల భామలంతా భాగ్యనగరానికి క్యూ కడుతున్నారు.
మే 10 నుంచి 31 వ తేదీ వరకూ హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్-2025 పోటీలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాలకు చెందిన యువతులు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్నారు. వారం ముందు నుంచే వివిధ దేశాల నుంచి భాగ్యనగరానికి అందాల భామల రాక మొదలైంది.
తెలంగాణ ప్రభుత్వాధికారులు ఇవాళ మిస్ ఘనా జుట్టా అమా పొకువా అడో, మిస్ నమీబియా సెల్మా కార్లీసియా కామనీలకు సంప్రదాయ పద్ధతిలో శంషాబాద్ ఎయిరుపోర్టులో ఘనస్వాగతం పలికారు.
సంప్రదాయ నృత్యం చేస్తూ కళాకారులు మిస్ ఘనా, మిస్ నమీబియాలకు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత అధికారులు ప్రత్యేకంగా సత్కరించి గౌరవించారు.
ఇదిలా ఉంటే, మే 10వ తేదీన సాయంత్రం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్డేడియంలో మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. మే 31న గ్రాండ్ ఫినాలే ఉంటుంది.
Updated Date - May 05 , 2025 | 08:06 PM