AP Govt: ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర
ABN, Publish Date - May 12 , 2025 | 01:31 PM
ఏపీలో నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ మేరకు ఆదివారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా 22 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఈ జాబితాలో అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)కి చెందిన ఇద్దరికి కీలక పదవులు దక్కాయి. అమరాతి జేఏసీలో చురుగ్గా వ్యవహరించిన డాక్టర్ రాయపాటి శైలజను ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా, ఆలపాటి సురేశ్‌ను ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించారు. మొత్తం 22 పదవుల్లో టీడీపీకి 16, జనసేనకి 3, బీజీపీకి 1, అమరావతి జేఏసీకి 2 పదవులు దక్కాయి. టీడీపీ తీసుకున్న 16 పదవుల్లో 8 మంది బీసీలకు అవకాశం ఇవ్వగా మిగిలిన వారు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారున్నారు. మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్ జవహర్‌కు కార్పొరేషన్ల చైర్మన్ పదవులు దక్కాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో పలు రాజకీయ సమీకరణాలతో ఆయా స్థానాల్లో పోటీ చేయలేని వారికి, పార్టీ కోసం, అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నేతలకు ఈసారి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. ఈ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. బీసీలకు 8, ఎస్సీలు 2, ఎస్టీలకు ఒక పదవి దక్కాయి. మొత్తం పదవుల్లో 36 శాతం బీసీలకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
నిడదవోలు, తిరుపతి, తాడేపల్లిగూడెం స్థానాలను మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో భాగమైన జనసేనకు కేటాయించింది. నామినేటెడ్ పదవుల్లో మాజీ ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, సుగుణమ్మ, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్‌చార్జి వలసల బాబ్జికి అవకాశం కల్పిచింది. టికెట్లు వదులుకున్న ఈ ముగ్గురికి ప్రాధాన్యం కల్పించింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా శేషారావును, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా సుగుణమ్మను, భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్‌గా వలసల బాబ్జిని కూటమి ప్రభుత్వం నియమించింది.
మొన్నటి ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి మాజీమంత్రి కేఎస్ జవహర్ టికెట్ ఆశించారు. పలు రాజకీయ సమీకరణాలతో ఆయనకు అవకాశమివలేదు. అయినా పార్టీని నమ్ముకుని విధేయంగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడూ వైసీపీతో పోట్లాడారు. జవహర్‌ను ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది.
గతంలో మలేపాటి సుబ్బనాయుడు తెలుగుదేశం కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. టికెట్ కోసం చివరి నిమిషం వరకూ పోరాడారు. పలు సమీకరణాల్లో బాగంగా ఇక్కడి నుంచి కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ అవకాశం కల్పించింది. సుబ్బనాయుడికి ఇప్పుడు ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది.
టీడీపీకి మాజీమంత్రి పీతల సుజాత తొలి నుంచి విధేయురాలు. 2019, 2024 ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదు. అయినా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారనే పేరుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుజాతకు తొలి విడతలో విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల భర్తీలోనే వినియోగదారుల రక్షణ మండలి ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది. సాంకేతిక సమస్యలతో పీతల సుజాత ఆ బాధ్యతలు తీసుకోలేదు. మళ్లీ ఆమెను కీలకమైన మహిళా సహాకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించింది.
టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా వెంకట శివుడు యాదవ్ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో గుంతకల్లు నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఆశించారు. అక్కడి నుంచి మాజీమంత్రి జయరామ్ పోటీ చేశారు. దీంతో ఆయనకు హైకమాండ్ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు వెంకట శివుడు యాదవ్‌కు కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
డాలర్ దివాకర్‌రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలని భావించారు. కానీ అవకాశం దక్కలేదు. ఆయనకు తుడా ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది.
మండపేట నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ 2019లో ఆ స్థానం నుంచే పోటీ చేశారు. జనసేనలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఆయనను నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది.
ఒంగోలుకు చెందిన రియాజ్ ప్రస్తుతం జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2014 నుంచి జనసేనలో క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019లో ఒంగోలు నుంచి జనసేన తరఫున పోటీ చేశారు. ఆయనను లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది.
జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా డా.పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు. గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగానూ పనిచేశారు. 2014 నుంచి జనసేనలో చురుగ్గా పనిచేస్తున్నారు. హరిప్రసాద్‌కు ఇప్పుడు హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
అమరావతి ఐకాసలో చురుగ్గా పనిచేసినవారికీ నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. రాజధాని పరిరక్షణ ఉద్యమంలో, రైతులు చేపట్టిన పాదయాత్రలో రాయపాటి శైలజ క్రియాశీలక పాత్ర పోషించారు. జగన్ హయాంలో వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అసభ్య దూషణలు, దాడులకు ఆమె బాధితురాలు. వాటిని లెక్క చేయకుండా ఆమె రాజధాని ఉద్యమంలో గట్టిగా పోరాడారు. ఇలాంటి నేపథ్యం ఉన్న శైలజను మహిళల హక్కులను పరిరక్షించే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది.
వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలపై ‘విధ్వంసం’ పేరిట పాత్రికేయుడు ఆలపాటి సురేశ్‌కుమార్ పుస్తకం రాశారు. ఆయనకు ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా కూటమి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
డా.రవి వేమూరి ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2014-19 మధ్య ఇదే పోస్టులో ఆయన పనిచేశారు. ప్రవాసాంధ్రుల్లో పార్టీకి మద్దతు కూడగట్టడం, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. టీడీపీకి తొలి నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నారు.
కుమ్మరి శాలివాహన సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన పేరేపి ఈశ్వర్.. ప్రస్తుతం టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, విజయవాడ 13వ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో పార్టీకి విజయవాడ అర్బన్ బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఛైర్మన్‌గా అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి.
Updated Date - May 12 , 2025 | 01:40 PM