CM Chandrababu In Dubai: 9 ఏళ్ళ హాంశ్ నుండి 92 ఏళ్ళ ఫాతిమా వరకు..
ABN, Publish Date - Oct 26 , 2025 | 07:24 PM
దుబాయి పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమతో సమావేశం కావడం పట్ల ప్రవాసాంధ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దుబాయి చంద్రబాబు నాయుడు పర్యటన విశేషాలు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంత్రివర్గంలో సభ్యునిగా నుంచి మొదలు నేటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దుబాయితో మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. దుబాయి అభివృద్ధిను నిశితంగా గమనించే భారతీయ నాయకులలో ఆయన అగ్రగణ్యుడు సీఎం చంద్రబాబు. తన సుదీర్ఘ ప్రజాజీవితంలో ఆయన అనేక సార్లు దుబాయిను సందర్శించినా స్ధానికంగా ఉన్న తెలుగు ప్రవాసీయులను ఎప్పుడు కలుసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు నాయుడు దుబాయిలో ప్రవాసీయుల సభతో గత ముప్పయి సంవత్సరాలుగా ఉన్న లోటును పూడ్చడమే కాకుండా రానున్న మరో ఇరవై సంవత్సరాల వరకు ముందస్తు కూడ చెల్లించారని చెప్పవచ్చు. రాజకీయ నాయకుల సభలు, సమావేశాలకు సహజంగా దూరంగా ఉండెే దుబాయి, ఇతర గల్ఫ్ దేశాలలో ఈ రకమైన సాముహిక సమావేశాలు జరగడం అత్యంత అరుదు. 1990 దశకంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, 2010లలో తెలంగాణ ధూంధాం 2015లో ప్రధాని నరేంద్ర మోదీల సభలు ఈ అత్యంత అరుదైన జాబితాలోకి వస్తాయి. కానీ ఈ మూడింటిలోనూ ఎక్కడ కూడ సభా వేదికపైకి సామాన్యులే కాదు నాయకులు సైతం వెళ్ళడానికి వీలు లేదు. దుబాయిలో జన్మించిన తొమిదెళ్ళ వేమూరి హంశ్ నుంచి మొదలు కాకినాడలో పుట్టి పెరిగి దుబాయిలో స్ధిరపడ్డిన 92 ఏళ్ళ ఫాతిమా వరకు సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు.
సీఎం చంద్రబాబు నాయుడు పక్కన ఒక వైపు ఆయన భద్రత సిబ్బంది.. మరో వైపు తెలుగుదేశం గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధకృష్ణాలను సైతం ఆయన వారిస్తూ అందరితో కరచాలనం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఓపికగా అందర్ని కలిసిన తీరుకు సభికులు మంత్రమగ్ధులయ్యారు. సౌదీ అరేబియా నుండి వచ్చి తనను కలిసిన గడ్డం శిల్పా, చెన్నుపాటి అక్షితలతో అప్యాయంగా మాట్లాడుతూ అంతకు ముందు వారు తనను విజయవాడలో కూడ కలిసిన విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు గుర్తు చేయడంతో వీరిద్దరు ఆయన జ్ఞాపకశక్తిని గమనించి అశ్చర్యపోయారు.
వర్షాలు కూడా పడని దుబాయి అభివృద్ధిను ఒకప్పుడు ఎవరు కూడ ఉహించ లేదని అదే విధంగా రైతు బిడ్డలు ఐటి ఇంజినీర్లుగా ఎదుగుతారని కూడ ఒకప్పుడు ఉహించలేదని కానీ దూరదృష్టి, భవిష్యత్తుకు భరోసా అనే దృక్పథంతో ఇది సాధ్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు. చమురు ఆదాయం లేని దుబాయికు పర్యాటక రంగం ప్రధాన ఆదాయ వనరు కాగా కేవలం ఒక్క విమానశ్రాయాన్ని ఆధారితం చేసుకోని దుబాయి ఏమిరేట్ పర్యాటక రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఆయన ప్రత్యక్ష అనుభవాలను ఉదహరిస్తూ వివరించారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఒక లక్షా యాభై వేల హోటల్ రూంలతో పర్యాటక రంగాన్ని ఈ ఇసుక ఎడారి నగరం అభివృద్ధి చేసిన తీరును వివరిస్తూ నీళ్ళు, చెట్లు లేని దుబాయి శరవేగంగా ప్రగతిలో పురోగమిస్తుండగా అన్ని ఉండి తామెందుకు వెనుకబడి ఉంటున్నామో అలోచించాలని ఆయన అన్న మాటలు అందర్ని అలోచింప జేసాయి. తాను ఇంటికు ఒక్కరు చొప్పున ఐటీ ఇంజినీర్‌ను చేస్తానని 1990లలో ప్రకటిస్తే హేళన చేసిన వారున్నారని గుర్తు చేశారు. రానున్న తరానికి కావల్సిన క్వాంటం కంప్యూటింగ్‌కు తాను నవ్యాంధ్రప్రదేశ్ నుంచి శ్రీకారం చుట్టనున్నట్లుగా హర్షధ్వానాల మధ్య సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
ఎంత అశేష ప్రజాభిమానం కలిగిన నాయకులు వచ్చినా సభ నిర్వహణ తీరు సరిగ్గా లేని పక్షంలో వృధా అవుతుంది, దుబాయిలో మాత్రం తెలుగుదేశం గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా అధ్వర్యంలో పార్టీ స్ధానిక నాయకులు ముక్కు తులసీ కుమార్, విశ్వేశ్వరావు, వాసురెడ్డి, రాజ రవికిరణ్, బాషా, స్ధానిక ప్రముఖులు సునీల్ బొయపాటిలు, ఇతర వాలంటీర్లు ఓర్పు, సహానంతో రేయింబవళ్ళు కష్టపడ్డారు. వీరికి దన్నుగా అటు మంగళగిరిలో ఎపీ ఎన్నార్టీ ప్రవాసీ సంస్ధ నిలిచింది. విజయవాడలో పార్టీ ప్రముఖులు వేమూరి రవి, బుచ్చిరాం ప్రసాద్ కూడ ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చారు. దుబాయిలోని తెలుగుదేశం పార్టీ నాయుకులు వచ్చిన ప్రతి ఒక్కర్ని అప్యాయతతో సాదర స్వాగతం పలికారు. వీరెవరికి కూడా మాతృభూమిలో కంట్రాక్టులు లేదా రాజకీయ పదవుల ఆరాటం లేదు. రాజకీయం అనేది సంపూర్ణ వ్యాపారమైన ఈ కాలంలో ఒక అభిరుచితో మాత్రమే తమ ఉద్యోగాలు చేసుకోంటూ ఎడారిలో పసుపు జెండాను మోస్తున్నారు.
దుబాయిలోని బిర్యానీ మోర్స్ హోటల్‌లో అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను నిర్వహించుకోనే వీరికి చంద్రబాబు నాయుడు సభ విజయవంతం కావడంతో పార్టీను క్షేత్రస్ధాయిలో విస్తరించెే బాధ్యత భుజస్కంధాలపై పడింది. సరిగ్గా అదే రకమైన సమబాధ్యత పార్టీ నాయకత్వంపై కూడా ఉంది. సభకు ముందు ఉదయం హోటల్‌లో వేమూరు రవి, రావి రాధాకృష్ణాల నాయకత్వంలో పార్టీ నాయకులతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు చేసిన దశ, దిశా నిర్దేశం ఎడారిలో పార్టీను మరింత బలోపేతం చేస్తుందని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు.
ముఖ్యమంత్రి సమావేశం దుబాయిలోని తెలుగు సంఖ్యా బలాన్ని చాటి చెప్పింది. ప్రప్రధమంగా దుబాయి, ఉత్తరాది ఏమిరేట్లలో భారీ సంఖ్యలో ఔత్సిహిక తెలుగు ప్రవాసీయులను చూసి అశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగిందని దుబాయిలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సతీష్ కుమార్ శివన్ ఈ విలేకరితో మాట్లాడుతూ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇల్లు శుభ్రం చేయని భర్తపై కత్తితో దాడి.. యూఎస్‌లో భారత సంతతి మహిళ అరెస్టు
చంద్రబాబు యూఏఈ పర్యటన.. దుబాయ్‌లో సీఎంకు ఘన స్వాగతం
Updated Date - Oct 26 , 2025 | 10:22 PM