Indian Origin Woman: ఇల్లు శుభ్రం చేయని భర్తపై కత్తితో దాడి.. యూఎస్‌లో భారత సంతతి మహిళ అరెస్టు
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:33 AM
అమెరికాలోని నార్త్ కెరొలీనా రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇల్లు శుభ్రం చేయలేదన్న కారణంతో భార్య తనపై దాడి చేసిందని ఓ భారత సంతతి వ్యక్తి ఆరోపించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ఆమెను బెయిల్‌పై విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భర్తపై కత్తితో దాడి చేసిన ఆరోపణలపై ఓ భారత సంతతి మహిళను నార్త్ కెరొలీనా (North Carolina) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని చంద్రప్రభా సింగ్‌గా (44) గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చంద్రప్రభా సింగ్ తన కుటుంబంతో కలిసి ఛార్లెట్‌లోని బాలెంటైన్ ప్రాంతంలో ఉంటున్నారు. స్థానికంగా ఉన్న ఎన్‌ధావెన్ ఎలిమెంటరీ స్కూల్లో కే-3 టీచర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్ 12న చంద్రప్రభ తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని భర్త అరవింద్ సింగ్ పోలీసులకు తెలిపాడు. ఇల్లు శుభ్రం చేయనందుకు తనపై రెచ్చిపోయి కత్తితో దాడి చేసిందని తెలిపారు (Indian Origin Woman Attacks Husband with Knife).
అయితే, చంద్రప్రభ మాత్రం ఈ ఆరోపణను కొట్టిపారేసింది. పొరపాటున ఇలా జరిగిందని చెప్పింది. వంటగదిలో తాను బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేస్తున్న సమయంలో భర్త వచ్చి ఏదైనా సాయం చేయనా? అని అడిగాడని తెలిపింది. ఇల్లు శుభ్రంగా లేనందుకు అప్పటికే తనకు చికాకుగా ఉందని తెలిపింది. ఈ క్రమంలో అతడివైపు వేగంగా తిరగడంతో చేతిలోని కత్తి అతడికి తగిలిందని తెలిపింది. ఇక మెడపై తీవ్ర గాయం కావడంతో అరవింద్‌ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ప్రమాదకరమైన ఆయుధంతో దాడి చేసినట్టు చంద్రప్రభపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆమె స్కూల్ పరిసరాల్లో జరగలేదని, విద్యార్థులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని భరోసా ఇచ్చారు.
కాగా, నిందితురాలిని మెజిస్ట్రేట్ గత అక్టోబర్ 13న 10 వేల డాలర్ల పూచీకత్తుపై విడుదల చేశారు. ఆమె లొకేషన్‌ను ఎప్పటికప్పుడు తెలిపే ఎలక్ట్రానిక్ డివైజ్‌ను కచ్చితంగా కాలికి తగిలించుకోవాలిని, భర్తను కలిసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయొద్దని చంద్రప్రభను హెచ్చరించారు.
ఇవీ చదవండి..
తానా న్యూజెర్సీ హైకింగ్ ఈవెంట్ విజయవంతం
చంద్రబాబు యూఏఈ పర్యటన.. దుబాయ్‌లో సీఎంకు ఘన స్వాగతం