AP CM UAE Visit: చంద్రబాబు యూఏఈ పర్యటన.. దుబాయ్‌లో సీఎంకు ఘన స్వాగతం
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:07 PM
మూడు రోజుల యూఏఈ పర్యటన నిమిత్తం బుధవారం నాడు దూబాయ్‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. స్థానిక కాన్సుల్ జనరల్‌తోపాటు టీడీపీ నేతలు, ఎన్నారై ప్రముఖులు ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ఆంధ్రజ్యోతి, గల్ఫ్ ప్రతినిధి: యూఏఐ పర్యటనపై బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (బుధవారం) దుబాయ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎంకు ఘనస్వాగతం లభించింది. స్థానిక భారతీయ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, దుబాయ్ నగర శాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విశ్వేశరరావు, ముక్కు తులసి కుమార్, తెలుగు సంఘం అధ్యక్షుడు మసీయోద్దీన్, ఇతర అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. చంద్రబాబును ఆహ్వానించేందుకు ప్రవాసాంధ్ర మహిళలు కూడా పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. యూఏఈలో సీఎం మూడు రోజులపాటు పర్యటించనున్నారు (CM Chandrababu Dubai Visit).

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రవాసీయులు భారీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి అన్ని గల్ఫ్ దేశాలకు చెందిన ప్రవాసీ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు దుబాయ్‌కు బయలుదేరుతున్నారు. ప్రవాసీయుల సంక్షేమానికి ఉద్దేశించిన ప్రవాసాంధ్ర భరోసా అనే వినూత్న బీమా పథకాన్ని దుబాయ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ పథకం వల్ల ఆపదలో ఉన్న ప్రవాసీయులకు, వారి కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాధాకృష్ణ పేర్కొన్నారు. మరణించిన సందర్భాల్లో రూ.10 లక్షల వరకూ పరిహారాన్ని ఈ పథకం కింద అందించనున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి..
వార్సాలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!
హాంబర్గ్‌లో ఘనంగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవం