Sri Venkateswara Kalyanotsavam: హాంబర్గ్‌లో ఘనంగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవం
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:03 PM
జర్మనీలోని హాంబర్గ్‌లో శ్రీనివాస కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళ, కన్నడతోపాటు జర్మనీలో నివసిస్తున్న భారత్‌లోని ఇతర రాష్ట్రాల వారు సైతం భారీ సంఖ్యలో హాజరయ్యారు.
హాంబర్గ్: జర్మనీలోని హంబర్గ్‌లో శ్రీనివాసుడి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) సహకారంతో శ్రీ వేంకటేశ్వర మందిర్ హాంబర్గ్ ఇ.వి, మన తెలుగు హాంబర్గ్ అసోసియేషన్ (మాతా ఇ.వి) ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటీవల్ ఇంజినీర్ మల్లయ్య పర్యవేక్షణలో అర్చక స్వాముల బృందం సుప్రభాతం, తోమాల సేవ, అర్చనలతో ఈ కళ్యాణోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలతో మంగళవాయిద్యాల మధ్య శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల కళ్యాణమహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు జర్మనీలోని తెలుగు, తమిళ, కన్నడతోపాటు భారత్‌లోని ఇతర రాష్ట్రాల వాసులు సైతం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులకు టీటీడీ లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈ కళ్యాణోత్సవం ద్వారా తమందరికి ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని నిర్వాహకులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆ దేవ దేవుడు శ్రీవెంకటేశ్వరుని దివ్య కృప కటాక్షాలు భక్తులందరిపై ఉండాలని తద్వారా వారికి శాంతి, సౌభాగ్యం కలగాలని నిర్వాహాకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రీవెంకటేశ్వర మందిర్ హాంబర్గ్ ఇ.వి, మన తెలుగు హాంబర్గ్ అసోసియేషన్ (మాతా ఇ.వి) ప్రతినిధులు డా. శివశంకర్ లింగం, శ్రీనివాస్ వడ్డాది, శశిధర్ వేమిరెడ్డి, సంతోష్ కె. నీలం, శివ కోలా, వెంకటేశులు నర్రెడ్డుల, సాగర్ మీశాల, అభిలాష్ మోరేశ్వర్, స్వాతి మాశెట్టి, సాయి చరణ్, రవి తేజ, దినేష్ పాకలపాటి, పల్లవి పప్పల, స్రవంతి కనపర్తి, నాగమణి మాధవన్, రాజేష్, ప్రసాద్ బృందం అవిశ్రాంతంగా కృషి చేశారు.

అలాగే ఈ కళ్యాణోత్సవానికి మ్యూనిచ్, ఫ్రాంక్ ఫర్ట్ ప్రతినిధులు టిట్టు మద్దిపట్ల, సూర్య వెలగా తదితరులు హాజరయ్యారు. యూరప్ ప్రధాన కో ఆర్డినేటర్ డా. కిషోర్ బాబు చలసాని సారథ్యంలో డా. శ్రీకాంత్, సుమంత్ కొర్రపాటి తదితరులు శ్రీనివాస కళ్యాణ మహోత్సవం విజయవంతంగా నిర్వహించడానికి.. అందరిని సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమెరికా సాహితీ సంస్థల ఆధ్వర్యంలో తెలుగు సాహితీవేత్తలకు జీవన సాఫల్య పురస్కారాలు
ఖతర్ తెలుగు ప్రవాసీ ఎన్నికలలో అనూహ్య తీర్పు..