Tej Pratap: ఐదు చిన్న పార్టీలతో తేజ్‌ప్రతాప్ కూటమి
ABN, Publish Date - Aug 05 , 2025 | 09:34 PM
వికాస్ వంచిత్ ఇన్సాన్ పార్టీ (వీవీఐపీ), భోజ్‌పురియ జన్ మోర్చా (బీజేఎం), ప్రగతిశీల్ జనతా పార్టీ (పీజేపీ), వజిబ్ అధికార్ పార్టీ (డబ్ల్యూఏపీ), సంయుక్త్ కిసాన్ వికాస్ పార్టీ (ఎస్‌కేవీపీ)లతో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు తేజ్‌ప్రతాప్ ప్రకటించారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఐదు చిన్న పార్టీలతో కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్జేడీ బహిష్కృత నేత, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) మంగళవారంనాడు ప్రకటించారు. ఆ ఐదు పార్టీల అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.
వికాస్ వంచిత్ ఇన్సాన్ పార్టీ (వీవీఐపీ), భోజ్‌పురియ జన్ మోర్చా (బీజేఎం), ప్రగతిశీల్ జనతా పార్టీ (పీజేపీ), వజిబ్ అధికార్ పార్టీ (డబ్ల్యూఏపీ), సంయుక్త్ కిసాన్ వికాస్ పార్టీ (ఎస్‌కేవీపీ)లతో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు తేజ్‌ప్రతాప్ ప్రకటించారు.
మహువా నుంచి పోటీ
అసెంబ్లీ ఎన్నికల్లో 2020 వరకూ తాను ప్రాతినిధ్యం వహించిన మహువా నుంచే ఈసారి పోటీ చేయనున్నట్టు తేజ్ ప్రతాప్ వెల్లడించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ 'టీమ్ తేజ్ ప్రతాప్ యాదవ్'తో కనెక్ట్ అయినట్టు చెప్పారు. 'జనం నవ్వుకున్నా సరే నేను నా సొంత మార్గంలోనే ప్రయాణించాలనుకుంటున్నాను. మా కూటమి సామాజిక న్యాయం, సామాజిక హక్కులు, బీహార్‌లో సమగ్ర మార్పుల కోసం పాటుపడుతుంది' అని ఆయన చెప్పారు. ప్రజలు తమకు అనుకూలంగా తీర్పునిస్తే రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని, రామ్ మనోహర్ లోహియా, కర్పూరి ఠాకూర్, జయప్రకాష్ నారాయణ్ కన్న కలలను నిజం చేస్తామని తెలిపారు.
అనుష్క అనే అమ్మాయితో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని తేజ్ ప్రతాప్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ రాజకీయంగా కలకలం సృష్టించింది. తేజ్ ప్రతాప్‌కు అప్పటికే వివాహం కావడం, ఆ వివాహం చిక్కుల్లో పడిన నేపథ్యంలో ఆర్జేడీ ఆయనపై క్రమశిక్షణ చర్యలకు దిగింది. పార్టీ నుంచి ఆరేళ్ల పాటు ఆయనను బహిష్కరించింది.
ఇవి కూడా చదవండి..
ధరాలి బాధితుల క్షేమం కోసం ప్రార్ధిస్తున్నా: మోదీ
జల ప్రళయం.. కొట్టుకుపోయిన గ్రామం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 05 , 2025 | 09:40 PM