Cloudburst: జల ప్రళయం.. కొట్టుకుపోయిన గ్రామం
ABN , Publish Date - Aug 05 , 2025 | 03:54 PM
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం చిగురుటాకులా వణుకుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి.
డెహ్రాడూన్, ఆగస్ట్ 05: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం చిగురుటాకులా వణుకుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మంగళవారం ఉత్తర కాశీ సమీపంలోని దరాలి గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 50 మంది వరకు గల్లంతయినట్లు తెలుస్తుంది. దీనిపై సమాచారం అందుకోగానే జిల్లా అధికారులు, ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.

మరోవైపు గంగోత్రికి వెళ్లే మార్గం భారీ వరదల కారణంగా కొట్టుపోయింది. దీంతో ఆ ప్రాంతంతో రవాణా సంబంధాలు తెగిపోయాయి. అదీకాక పర్వత ప్రాంతాలపై కురిసిన భారీ వర్షం వరదగా మారి.. జనవాసాలను ముంచెత్తాయి. దీంతో పలు ఇళ్లు.. ఆ ప్రవాహా దాటికి కొట్టుకుని పోగా.. భారీ వృక్షాలు సైతం నెలకూలాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ.. ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ.. తగిన సూచనలు చేస్తున్నారు.

భారీ వర్షాల కారణంగా ఉత్తర కాశీలో చోటు చేసుకున్న ఘటన తనను కలచి వేసిందని సీఎం పుష్కర్ సింగ్ తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు, ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు..యుద్ధ ప్రాతిపదిక సహాయక చర్యలు చేపట్టాయని వివరించారు. ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం సింగ్ పేర్కొన్నారు. ఇక ఈ ఘటన వివరాల కోసం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేసి మాట్లాడారన్నారు.
అనంతరం ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి 16 మంది ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీసుల బృందానికి తరలించామని చెప్పారని వివరించారు. రహదారులు కొట్టుకు పోవడం వల్ల ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయన్నారు. ఇంకోవైపు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. స్కూళ్లతోపాటు కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు. ఇక హరిద్వార్‌లోని గంగా, కాళీ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయన్నారు.
పొరుగునున్న హిమాచల్‌ప్రదేశ్‌లో..
అలాగే పొరుగునున్న హిమాచల్ ప్రదేశ్‌లో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 310 రహదారులతోపాటు పలు జాతీయ రహదారులను మూసివేశారు. దీంతో రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షకాలంలో హిమాచల్ ప్రదేశ్‌లో 103 మంది మరణించారు. అలాగే 36 మంది గల్లంతయ్యారని అధికారికంగా ప్రభుత్వం గణాంకాలను వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
మణిపూర్‌లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన, రాజ్యసభ ఆమోదం
జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి