RS Bharathi: ఆర్‌ఎస్ భారతి ఫైర్.. ఆ వీడియోలు చూసి ఆనందిస్తారా..
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:54 AM
మదురై మురుగన్ భక్తుల మహానాడులో పెరియార్, అన్నాదురై ద్రావిడ సిద్ధాంతాలను విమర్శిస్తూ రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తుంటే అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రులు ఆర్బీ ఉదయకుమార్, సెల్లూరు రాజు, కడంబూరు రాజు, రాజేంద్రబాలాజీ ఆసక్తిగా చూస్తూ పార్టీ పరువును దిగజార్చుకున్నారని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- అన్నాడీఎంకే నేతలపై ఆర్‌ఎస్ భారతి ధ్వజం
చెన్నై: మదురై మురుగన్ భక్తుల మహానాడులో పెరియార్, అన్నాదురై ద్రావిడ సిద్ధాంతాలను విమర్శిస్తూ రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తుంటే అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రులు ఆర్బీ ఉదయకుమార్, సెల్లూరు రాజు, కడంబూరు రాజు, రాజేంద్రబాలాజీ ఆసక్తిగా చూస్తూ పార్టీ పరువును దిగజార్చుకున్నారని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి(RS Bharathi) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై అన్నాడీఎంకే పార్టీ పతాకంలో అన్నాదురై చిత్రపటాన్ని తొలగించి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫొటో పెట్టుకోవడం మంచిదని, పార్టీ పేరు కూడా ‘అమిత్‌షా డీఎంకే’గా మార్చుకోవడం మంచిదని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై కీర్తి ప్రతిష్ఠతలను దిగజార్చేలా విమర్శలున్న వీడియో మహానాడు ప్రాంతమంతటా ఎల్‌ఈడీ స్ర్కీన్లపై ప్రదర్శిస్తుంటే అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రులు మౌనంగా చూస్తూ ఊరుకున్నారే కాని, కనీసం నిరసన తెలపలేదని ఆరోపించారు.
అన్నాడీఎంకే మాజీ నేతలు ఎంజీఆర్, జయలలిత బ్రతికుంటే ఆ మాజీ మంత్రులపై కఠిన చర్యలు తీసుకుని ఉండేవారని, ప్రస్తుత ఆ పార్టీ నేత ఎడప్పాడి పళనిస్వామికి అంతటి ధైర్యం లేదని విమర్శించారు. ఎడప్పాడి తన ఆస్తులు కాపాడుకోవడమే లక్ష్యంగా పార్టీని, మాజీ నేతలను బీజేపీకి తాకట్టుపెట్టేశారని విమర్శించారు. అన్నాదురైని బీజేపీ నేతలు తులనాడుతుంటే నోరెత్తని అన్నాడీఎంకే నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాదురై పేరు చెప్పుకుని ఎలా ఓట్లడుగుతారని ప్రశ్నించారు.
1956లో మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో జరగని ఓ ఘటన గురించి చెబుతూ అన్నాదురైపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నా వినీవిననట్లు మాజీ మంత్రులు వేదికపైనే కూర్చుండి పోయారన్నారు. ఆదివారం అన్నాడీఎంకే మాజీ మంత్రులు మురుగన్ మహానాడులో పాల్గొంటే, సోమవారం కోవైలో జరిగిన ఆర్‌ఎ్‌సఎస్ శతవార్షికోత్సవాల్లో ఆ పార్టీకి చెందిన మరో మాజీమంత్రి ఎస్పీ వేలుమణి పాల్గొన్నారని, ఇక పార్టీ నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) రాబోవు దిన్నాల్లో నాగపూర్ శిబిరంలో శాశ్వతంగా తలదాచుకున్నా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.
దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఆర్‌ఎస్ఎస్ ను తీవ్రంగా వ్యతిరేకించారని, ఈపీఎస్ వారి బాటలో నడువకుండా బీజేపీ బాటలోనే నడుస్తున్నారని, కనుకనే అన్నాదురై, పెరియార్‌ని కించపరిచే వీడియోలు ప్రదర్శిస్తుంటే మౌనంగా కూర్చున్న మాజీ మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకున్నారన్నారు. ఉత్తరాదిలో శ్రీరాముడి పేరుతో మతచిచ్చు రగిల్చిన బీజేపీ రాష్ట్రంలో మురుగప్పెరుమాన్ పేరుతో మతచిచ్చు రగిల్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని విమర్శించారు. ఇక మహానాడు ప్రాంతం వద్ద ‘శూరపద్ముడిని వధించిన మురుగా, ద్రావిడసిద్ధాంతాన్ని నాశనం చేసేందుకు కదలిరా!’ అనే నినాదాలతో పోస్టర్లు అతికించారని, ఇంత జరిగినా పార్టీలో ద్రావిడ అనే పేరుందనే విషయం కూడా తెలియకుండా అన్నాడీఎంకే మాజీ మంత్రులు మురుగన్ మహానాడులో పాల్గొన్నారని ఆరోపించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేత అన్నామలై తదితరులు మైనారిటీలపై విమర్శల వర్షం కురిపించినా వేదికపై ముందు కూర్చున్న అన్నాడీఎంకే నేతలు, మాజీ మంత్రులు మౌనం పాటించారని ఆరోపించారు. ద్రావిడ సిద్ధాంతాలను నాశనం చేయాలన్న లక్ష్యంతో మురుగన్ మహానాడు జరిపిన బీజేపీతో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకుని ఆ పారీ నేతలంతా బానిసలుగా ప్రవర్తిస్తుండటాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని,
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గుణ పాఠం చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఆర్‌ఎస్ భారతి పేర్కొన్నారు. ఇదే విధంగా మురుగన్ మహానాడులో అన్నాదురై, పెరియార్ సిద్ధాంతాలను విమర్శిస్తూ రూపొందించిన వీడియోలను చూసి మౌనం పాటించిన అన్నాడీఎంకే కు చెందిన మాజీమంత్రులకు రాష్ట్ర ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, న్యాయశాఖ మంత్రి రఘుపతి కూడా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి
Read Latest Telangana News and National News
Updated Date - Jun 24 , 2025 | 11:54 AM