BRS: బండి సంజయ్‌ది అసత్య ప్రచారం
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:52 AM
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేంద్రమంత్రి బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. సోమవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు విలేకరులతో మాట్లాడారు.
బీఆర్‌ఎస్ నాయకుల ధ్వజం
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేంద్రమంత్రి బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. సోమవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు విలేకరులతో మాట్లాడారు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష 24 వేల కోట్లకు పెంచారని సంజయ్ నిరాధార ఆరోపణ చేశారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. బండి సంజయ్ వాస్తవాలు దాచి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
ఈటల రాజేందర్‌తో అధ్యక్ష పదవి విషయంలో ఉన్న పేచీతోనే సంజయ్ కాళేశ్వరంపై విషం కక్కుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. కాళేశ్వరంతో ఆయకట్టు పెరిగిందని తాము నిరూపిస్తామని దానిపై కరీంనగర్ చౌరస్తాలో చర్చకు వస్తావా అని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రాసిచ్చిన స్ర్కిప్ట్ బండి చదువుతున్నారని విమర్శించారు.