Heavy Rains: భారీ వర్ష సూచన.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్
ABN, Publish Date - May 29 , 2025 | 09:38 AM
రాష్ట్రంలో.. రెండు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 40 నుండి 50 కి.మీల వేగంతో పెనుగాలులతో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
చెన్నై: నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం కారణంగా కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలకు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం రెండు రోజులపాటు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో నీలగిరి, కోయంబత్తూరు(Neelagiri, Coimbatore) జిల్లాలోని కొన్ని కొండ ప్రాంతాల్లోనూ భారీ నుంచి ఓ మోస్తరుగా, తిరునల్వేలి జిల్లాలోని కొండ ప్రాంతాల్లోనూ, తేని, తెన్‌కాశి, కన్నియాకుమారి జిల్లాల్లో కొన్ని చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయన్నారు.
బుధవారం నీలగిరి, కోయంబత్తూరు, తెన్‌కాశి, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయని తెలిపారు. పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో బుధవారం ఉదయం చెదురుమదురుగా వర్షాలు కురిశాయన్నారు. గురువారం కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో గంటలకు 40 నుండి 50 కి.మీల వేగంతో పెనుగాలులతో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. తేని, తెన్‌కాశి, కన్నియాకుమారి జిల్లాల్లో పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తాయన్నారు.
ఈ నెల 31 నుండి జూన్ 3 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లోనూ, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. చెన్నై, సబర్బన్ ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ పరిశోధన కేంద్రం పేర్కొంది. సముద్రతీర ప్రాంతాల్లో గంటకు 50 నుండి 55 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయన్నారు. ఈ నెలాఖరువరకు జాలర్లు సముద్రంలో చేపలవేటకు వెళ్ళరాదని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క
Read Latest Telangana News and National News
Updated Date - May 29 , 2025 | 09:38 AM