Share News

CM Revanth Reddy: ఒకే మాటపై ఉందాం!

ABN , Publish Date - May 29 , 2025 | 04:33 AM

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే కొత్త పథకాలు, తీసుకునే నిర్ణయాలతోపాటు ప్రస్తుత పథకాల అమలు విషయంలో ఒకే మాట, అభిప్రాయంపై ఉందామని మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy: ఒకే మాటపై ఉందాం!

పథకాల అమలు, ఆర్థిక పరిస్థితులపై ఒకే నిర్ణయంతో ముందుకెళదాం

  • మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి.. తన నివాసంలో విందు

  • పీసీసీ, మంత్రివర్గ విస్తరణ, కవిత తదితర అంశాలపై చర్చ

  • రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే కొత్త పథకాలు, తీసుకునే నిర్ణయాలతోపాటు ప్రస్తుత పథకాల అమలు విషయంలో ఒకే మాట, అభిప్రాయంపై ఉందామని మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం బుధవారం రాత్రి మంత్రులకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ కూడా పాల్గొన్నారు. పలు కారణాలతో మంత్రి సీతక్క హాజరుకాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన గత ఏడాదిన్నర కాలంలో.. మంత్రులకు సీఎం విందు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పుపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. గురు, శుక్రవారాల్లో మంత్రులు జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో కూడా పలు సూచనలు చేసినట్టు సమాచారం. కొత్త పథకాల రూపకల్పన, ప్రస్తుత పథకాలు, జూన్‌ 2న ప్రారంభించబోయే రాజీవ్‌ యువ వికాసం పథకంపైనా సీఎం, మంత్రులు లోతుగా చర్చించారు. పథకాల అమలు, ఖర్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయంలో అంతా ఒకేతాటిపై ఉంటూ, ఐకమత్యంగా ముందుకెళ్లాలని సీఎం రేవంత్‌ పేర్కొన్నట్టు సమాచారం. అదే సమయంలో మంత్రులు తమ శాఖలపై మరింత పట్టు సాధించాలని సూచించినట్టు తెలిసింది. విందు భేటీలో భాగంగా రాష్ట్ర రాజకీయాలపైనా మంత్రులతో సీఎం రేవంత్‌ చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పరిస్థితి, బీఆర్‌ఎస్‌, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యంగా బీఆర్‌ఎ్‌సలో పరిణామాలపై పలువురు మంత్రులు మాట్లాడినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బహిర్గతమవడం, అందులోని అంశాలు, అమెరికా నుంచి వచ్చిన తరువాత కవిత చేసిన ‘దేవుడు, దయ్యాల’ వ్యాఖ్యలపై సీఎం, మంత్రులు చర్చించినట్టు తెలిసింది.


రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌

పీసీసీ కార్యవర్గం, మంత్రి వర్గ విస్తరణపై పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడేందుకు సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ భేటీ అనంతరం పీసీసీ, మంత్రివర్గ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విందులో మంత్రులతో సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. స్పష్టత వస్తే జూన్‌ మొదటివారంలో ఎప్పుడైనా.. ప్రకటిస్తారని తెలిపినట్టు సమాచారం. ఇక విందులో పాల్గొన్న మీనాక్షి నటరాజన్‌ కూడా పీసీసీ, మంత్రివర్గ కూర్పుపై పలు సూచనలు చేసినట్టు తెలిసింది. మంత్రులకు సీఎం ఇచ్చిన విందు రాత్రి 7.30గంటల నుంచి 12గంటల వరకు కొనసాగింది. అంతా ఒకేచోట, చాలా కాలం తరువాత కలవడంతో అన్ని అంశాలపై మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఈ విందులో ఉన్న మంత్రులంతా ఫోన్లను స్విచాఫ్‌ చేసుకున్నారు. రాత్రి 12.20 గంటలకు ఓ మంత్రికి ఫోన్‌ చేసినా స్విచాఫ్‌ రావడం గమనార్హం.


Also Read:

వావ్.. రైలు పట్టాల మీద జేసీబీ

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే

For More Telangana News and Telugu News..

Updated Date - May 30 , 2025 | 02:59 PM