Odisha Couple Tied to Yoke: ప్రేమ జంటపై పగపట్టిన ఊరు.. కాడెద్దులుగా మార్చి టార్చర్..
ABN, Publish Date - Jul 11 , 2025 | 08:07 PM
సాంకేతికతలో ప్రపంచం ముందుకు దూసుకెళ్తుంటే కొన్ని ప్రాంతాలు మాత్రం మూఢత్వంలో ముందుకెళ్తున్నాయి. తాజాగా ఒడిశాలో జరిగిన పైశాచిక ఘటనే అందుకు తార్కాణం. ప్రేమించుకున్న పాపానికి ఓ జంటను ఊరు ఊరంతా కలిసి కట్టుబాట్లను అధిగమించారనే పేరుతో కాడెద్దులుగా మార్చి టార్చర్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో సమాజంలోని అనాచారాలను మరోమారు బయటపెట్టింది.
Odisha Couple Ploughing Field Viral Video: సమాజంలో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కులమతాల పేరిట ప్రజలు చేస్తున్న దారుణ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కులాంతర వివాహం చేసుకున్నారనో.. ఆచారాలు అతిక్రమించారనో మానవత్వాన్ని మరిచి హత్యలు చేసిన ఘటనలు తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఒడిశాలో ఆ కోవకే చెందిన ఓ దారుణం చోటుచేసుకుంది. ఊరు ఊరంతా కలిసి ప్రేమ పెళ్లి చేసుకున్న పాపానికి ఓ జంటను నీచాతి నీచంగా హింసించింది. సంప్రదాయాలు, కట్టుబాట్లు అతిక్రమించారనే పేరుతో దుశ్చర్యలకు పాల్పడటమే గాక.. ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి శునకానందం పొందింది.
సభ్యసమాజం తలదించుకునేలా ఒడిశాలోని రాయగఢ్ జిల్లా కంజమాజిర గ్రామంలో ఓ దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన తన అత్త కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ ఊరి ఆచారాల ప్రకారం అత్తవరసయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేరం, ఘోరం, పాపం కిందే లెక్క. అందుకని గ్రామస్థులంతా తమ పెద్దరికాన్ని నిలబెట్టుకునేందుకు ప్రేమ జంటకు బుద్ధి చెప్తున్నామనుకుని ఓ హేయమైన దారుణానికి పాల్పడ్డారు. వారిద్దరినీ ఎద్దులు మాదిరిగా కాడికి కట్టి పొలం దున్నించారు. వారి వీపుపై ముల్లు కర్రతో చరుస్తూ పైశాచికానందం పొందారు.
ఈ దారుణానికి పాల్పడటమే కాకుండా దీన్ని వీడియో తీసి మరీ నెట్టింట్లో పెట్టడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంకా ఏ కాలంలో ఉన్నాం మనం అని ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరు యువతీ యువకులకు జీవితాంతం తోడుండాల్సిన భాగస్వామిని ఎంచుకునే హక్కు కూడా లేదా అని తిట్టిపోస్తున్నారు. కాగా, ఈ ఘటనకు కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మోదీ రిటైర్మెంట్ గురించే ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలంటూ కాంగ్రెస్ పోస్టు
బీహార్‌లో ఓట్ల చోరీకి కుట్ర.. ఈసీపై రాహుల్ విమర్శలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 11 , 2025 | 09:49 PM