PM Modi: జెలెన్ స్కీకి ప్రధాని మోదీ ఫోన్..
ABN, Publish Date - Aug 11 , 2025 | 07:39 PM
ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీకి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 11: ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీకి ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతియుత పరిష్కారానికి భారత్ తన వంతు మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. అలాగే భారత్ అందిస్తున్న సహకారం కొనసాగుతోందని ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. సోమవారం ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీకి ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వీరిద్దరు పలు కీలక అంశాలపై చర్చించారు. ఆ క్రమంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంపై వీరు సమీక్షించారు. పరస్పర ప్రయోజనాల సహకారం పెంపు మార్గాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. భవిష్యత్తులో సైతం సంప్రదింపులు కొనసాగించాలని వీరిద్దరు నిర్ణయించారు.
ఉక్రెయిన్ లక్ష్యంగా రష్యా జరుపుతున్న దాడులను ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆ దేశాధ్యక్షుడు వివరించారు. జాపోరిజ్జియా బస్టాండ్‌పై రష్యా బీకర బాంబుల దాడికి తెగ బడిందని తెలిపారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య శాంతి కోసం దౌత్యపరమైన అవకాశాలు కొనసాగుతాయని చెప్పారు. అయితే రష్యా దురాక్రమణతోపాటు అక్రమణలు కొనసాగుతోన్నాయని మండిపడ్డారు. దీంతో కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ప్రధాని మోదీకి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్‌కు మద్దతు తెలపడం పట్ల ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో సాధారణ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యే క్రమంలో ఇరువురు వ్యక్తిగతంగా భేటీ కావాలని వారు నిర్ణయించారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు ఉపయోగపడతాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలు, శాంతి, సౌభ్రాతృత్వం నెలకొంటాయని వీరు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎందుకో ఏమో.. పెళ్లి పీట లెక్కకుండానే వరుడు జంప్..
పులివెందులలో ఎన్నికల వేళ.. వైసీపీకి హైకోర్టు షాక్
Updated Date - Aug 11 , 2025 | 07:54 PM