Pulivendula: పులివెందులలో ఎన్నికల వేళ.. వైసీపీకి హైకోర్టు షాక్
ABN , Publish Date - Aug 11 , 2025 | 05:38 PM
మరికొన్ని గంటల్లో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. వైసీపీకి ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
కడప, ఆగస్ట్ 11: మరికొన్ని గంటల్లో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ ఈ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పుపై జోక్యం చేసుకోవాలంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పులో జోక్యాన్ని ఏపీ హైకోర్టు నిరాకరించింది.
ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో ఆరు పోలింగ్ బూత్‌లు మార్చాలంటూ లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. అయితే మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగుతుందని హైకోర్టుకు ఎన్నికల సంఘం తరఫున న్యాయవాదులు స్పష్టం చేశారు. అంతేకాదు.. ఎన్నికల ప్రక్రియ సైతం ప్రారంభమైందని కోర్టుకు వారు వివరించారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు పై విధంగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల్లో జరగనున్న జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. సోమవారం పులివెందుల్లో ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. మండల కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లుతోపాటు ఇతర పోలింగ్ సామాగ్రి చేరుకున్నాయని వివరించారు. మంగళవారం పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని ఆరు గ్రామ పంచాయతీల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.
మొత్తం 10,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు మొత్తం 100 మంది ఎన్నికల అధికారులు, సిబ్బందిని వినియోగించనున్నారు. ఇక పులివెందుల జడ్పీటీసీ పరిథిలోని గ్రామాలు సమస్యాత్మకం కావడంతో.. దాదాపు 700 మందితో భారీ భద్రతను పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు ఈ జడ్పీటీసీ ఎన్నికలను అటు అధికార కూటమితోపాటు ఇటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సిగ్గు చేటు జగన్: హోమ్ మంత్రి అనిత
వైఎస్ జగన్ మేనమామపై కేసు నమోదు!
For More AndhraPradesh News And Telugu News