Share News

Vangalapudi Anitha: సిగ్గు చేటు జగన్: హోమ్ మంత్రి అనిత

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:20 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత ఇలాకా పులివెందుల, ఒంటిమిట్టల్లో జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాంటి వేళ ఈ ఎన్నికలపై హోమ్ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.

Vangalapudi Anitha: సిగ్గు చేటు జగన్: హోమ్ మంత్రి అనిత
AP Home Minister VangalaPudi Anitha

అమరావతి, ఆగస్ట్ 11: జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ ఇలాకా పులివెందులలోని ప్రజలు తొలిసారిగా ప్రజాస్వామ్యం రుచి చూస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అమరావతిలో మంత్రి వంగలపూడి అనిత విలేకర్లతో మాట్లాడతూ.. పులివెందుల తమ అడ్డా అని జబ్బలు చరుచుకున్నవాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యానికి భయపడుతున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ అండ్ కో ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ఓటమి భయం పట్టుకున్నందుకే వైఎస్ జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

వైఎస్ జగన్‌కు విలువలంటే తెలియదని.. అలాంటి ఆయన విలువల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అని చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్టల్లో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నిక జరుగుతుండటం చూసి ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు చేసుకునే స్థాయి నుంచి 11 మంది అభ్యర్థులు స్థానిక జెడ్పీటీసీ ఎన్నిక బరిలో ఉండటం ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు.


పోలింగ్ బూత్ మార్చే అధికారం ముఖ్యమంత్రి‌కి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జరిగిన ప్రక్రియపై వైసీపీ నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధికి, ఎన్నికల సంఘం అధికారాలపై ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్‌కు కనీస అవగాహన లేక పోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. నెలలో 20 రోజులు బెంగుళూరులో ఉంటూ గంజాయ్, బ్లేడ్ బ్యాచ్‌లను కలిసేందుకు వచ్చే జగన్‌కు వాస్తవ పరిస్థితులు ఏం తెలుసు? అని ఆమె ప్రశ్నించారు.


జగన్ హయాంలో జరిగినట్లు ఎక్కడైనా నామినేషన్లు ఎవరైనా లాక్కున్నారా?.. తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు చేర్చినట్లు పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికలో ఎక్కడైనా చేర్చారా? అంటూ మంత్రి వంగలపూడి అనిత వ్యంగ్యంగా అన్నారు. తల్లి, చెల్లికి ఆస్తి పంచకుండా కోర్టులో కేసు వేసిన వాడిని ఎలా నమ్మాలనే ఆలోచనలో పులివెందుల ప్రజలు ఉన్నారంటూ వైఎస్ జగన్‌కు ఈ సందర్భంగా ఆమె చరకలంటించారు.


పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాల్లోని ప్రజలు.. ఈ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసేందుకు భద్రతా చర్యలు చేపట్టామని వివరించారు. అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైఎస్ సునీతకు కావాల్సిన సాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆమె తండ్రిని కిరాతకంగా సొంత మనుషులే చంపారన్న వైఎస్ సునీత బాధ‌ను అంతా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Updated Date - Aug 11 , 2025 | 05:21 PM