Ceasefire Violation: విరమణ ఉల్లంఘన
ABN, Publish Date - May 11 , 2025 | 03:08 AM
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే పాకిస్థాన్ ఉల్లంఘించింది. డ్రోన్లతో దాడులు జరిపి బీఎస్‌ఎఫ్ ఎస్సై వీర మరణం చెందారు.
కాల్పుల విరమణకు భారత్, పాక్ ఓకే.. ఒప్పందం కుదిరిన గంటల్లోనే పాక్ ఉల్లంఘన
రాత్రంతా జరిపిన చర్చలు ఫలించాయి: ట్రంప్
వెంటనే, పాక్ విదేశాంగ మంత్రి దార్ సమర్థన
విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని పోస్టు
పాక్ దిగి వచ్చింది.. ఆ దేశ డీజీఎంవో ఫోన్ చేశారు
మన డీజీఎంవో అంగీకారం.. మళ్లీ రేపు
ఇరు దేశాల డీజీఎంవోల భేటీ: విక్రమ్ మిస్రి
సింధు నిలిపివేత, వీసా ఆంక్షలు కొనసాగుతాయి
భారత్‌పై ఉగ్ర దాడులను యుద్ధంగా పరిగణిస్తాం
మన షరతుల ప్రకారమే విరమణ ఉండాలన్న మోదీ
ఆ తర్వాత 4 గంటలకే పాక్ సైన్యం ఉల్లంఘన
డ్రోన్లతో దాడి.. బీఎస్ఎఫ్ ఎస్సై వీర మరణం
పేలుళ్లు జరుగుతున్నాయి.. ఒప్పందం ఎక్కడ?: ఒమర్
కశ్మీరు నుంచి గుజరాత్ వరకూ మళ్లీ చిమ్మ చీకట్లు
పాక్ మళ్లీ కాల్పులు జరుపుతోంది.. ఖండిస్తున్నాం
సీరియ్‌సగా తీసుకుంటాం.. ప్రతిచర్య తప్పదు: మిస్రి
సాయంత్రం దాదాపు ఐదు గంటలు! భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణపై తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన! ఆ తర్వాత పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఈషాక్ దార్ సమర్థన! సాయంత్రం ఆరు గంటలకు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి నిర్ధారణ! సాయంత్రం ఐదు గంటల నుంచే ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ప్రకటన! యుద్ధం నిలిచినందుకు ఇరు దేశాల ప్రజల్లోనూ ఓ ఊరట! ఇప్పటికైనా ప్రశాంతత నెలకొంటుందనే ఓ ఆశాభావం!
రాత్రి 9 గంటలు! మోసమే జీవన వేదంగా భావించే పాకిస్థాన్ తన వక్ర బుద్ధిని మరోసారి ప్రదర్శించింది! ఒప్పందం కుదిరి నాలుగు గంటలు కూడా కాకుండానే కాల్పుల విరమణను యథేచ్ఛగా ఉల్లంఘించింది! భారత్, పాక్ సరిహద్దు వెంబడి పెద్దసంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది! మన సైనిక పోస్టులపై పెద్దఎత్తున కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఆర్‌ఎస్ పురలో బీఎ్‌సఎఫ్ ఎస్సై ఒకరు వీర మరణం కూడా పొందారు!
మరి.. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నట్లా? లేనట్లా? పాక్ దిగొచ్చిందా!? పాకిస్థాన్ నమ్మక ద్రోహంపై భారత్ ఏం చేయనుంది!? భారతీయులందరిలోనూ ఇదిప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న!!
న్యూఢిల్లీ, మే 10: కొన్ని గంటల్లోనే.. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. శ్రీనగర్‌లో భారీ పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఉధంపూర్, బారాముల్లా, ఆర్‌ఎస్ పుర తదితర సెక్టార్లలోని భారత సైనిక పోస్టులపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది! శ్రీనగర్, పఠాన్‌కోట్, జైసల్మేర్, ఉధంపూర్, బార్మర్ తదితర ప్రాంతాల్లో యథావిధిగా చిమ్మ చీకట్లు నెలకొన్నాయి! పంజాబ్ గురుద్వారా సమీపంలో పేలుళ్లు! ఆర్‌ఎస్ పురలో పాక్ కాల్పులకు బీఎ్‌సఎఫ్ ఎస్సై ఇంతియాజ్ వీర మరణం పొందారు. పాక్ నిరంతరాయంగా ప్రయోగిస్తున్న డ్రోన్లను భారత్ అడ్డుకుని పేల్చేస్తుండడంతో ఇరు దేశాల సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. అక్కడి ప్రజల సంతోషం కొన్ని గంటలపాటు కూడా నిలవలేదు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న ఊరట వారికి దక్కలేదు. నిజానికి, మూడు రోజులపాటు భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగిన ఉద్రిక్తతలకు శనివారం సాయంత్రం తాత్కాలికంగా తెరపడింది. రాత్రంతా చర్చలు జరిపామని, ఇరు దేశాలూ తక్షణ, పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఆ తర్వాత కొద్ది సేపటికే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈషాక్ దార్ స్పందించారు. తక్షణమే కాల్పుల విరమణకు భారత్, పాకిస్థాన్ అంగీకరించాయని ప్రకటించారు. తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీ పడకుండా ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలు కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తుందని కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అంటే శనివారం సాయంత్రం ఆరు గంటలకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఎప్పట్లాగే విలేకరుల ముందుకు వచ్చారు. ‘‘పాకిస్థాన్ దిగి వచ్చింది. ఆ దేశ డైరెక్టర్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) మధ్యాహ్నం 3.30 గంటలకు భారత డీజీఎంవోతో చర్చలు జరిపారు. పూర్తిస్థాయిలో కాల్పులతోపాటు భూమ్మీద, ఆకాశంలోనూ, సముద్రంలోనూ సైనిక చర్యలను సాయంత్రం ఐదు గంటల నుంచి నిలిపివేయాలని ఇద్దరూ నిర్ణయించారు’’ అని ప్రకటించారు.
ఈ ఒప్పందం అమలుకు చర్యలు తీసుకోవాలని ఇరు వర్గాలకూ సూచించామని, డీజీఎంవోలు ఇద్దరి మధ్య ఈనెల 12వ తేదీన మళ్లీ చర్చలు జరుగుతాయని తెలిపారు. తొలుత, పాకిస్థాన్ డీజీఎంవో చొరవ చూపారని, మధ్యాహ్నం 3.35 గంటలకు ఆయనే ఫోన్ చేశారని, ఆ తర్వాత చర్చలు జరిగి ఒప్పందం కుదిరిందని వివరించారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కూడా ప్రకటించారు. ‘‘కాల్పులు, సైనిక చర్య నిలిపివేతకు భారత్, పాకిస్థాన్ ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాని నిర్మూలనకు భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది’’ అని ప్రకటించారు. అయితే, కాల్పుల నిలిపివేతకు భారత్, పాక్ నేరుగానే కసరత్తు చేశాయని, అమెరికా మధ్యవర్తిత్వం తర్వాతే ప్రకటన వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్వాగతించారు. అన్ని రకాల రవాణాకు తమ గగనతలాన్ని తెరుస్తున్నట్లు ఆ తర్వాత పాకిస్థాన్ కూడా ప్రకటించింది. అన్ని విమానాశ్రయాల్లోనూ సాధారణ కార్యకలాపాలు అందుబాటులోకి వచ్చాయని పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది.
యథావిధిగానే సింధు జలాల నిలిపివేత
కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ సింధు జలాల నిలిపివేత నిర్ణయం యథావిధిగానే కొనసాగుతుందని భారత విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. వీసా ఆంక్షలను కూడా ఉపసంహరించేది లేదని తేల్చి చెప్పాయి. ఎటువంటి షరతులూ లేకుండానే కాల్పుల విరమణకు అంగీకరించామని చెబుతూనే.. సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ అంతం చేసే వరకూ సింధు జల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని వివరించాయి. దీనికితోడు, భారతదేశంలో ఎక్కడైనా ఉగ్రవాద ఘటన జరిగితే.. దానిని తమ దేశంపై యుద్ధ చర్యగానే భావిస్తామని చెబుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు ఆ వర్గాలు వివరించాయి. అంతేనా.. మనం విధించే షరతుల ఆధారంగానే కాల్పుల విరమణ ఒప్పందం ఉండాలని ఎన్‌ఎ్‌సఏ అజిత్ డోభాల్, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
4 గంటల్లోనే..
ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నాలుగు గంటలు కూడా కాకుండానే పాకిస్థాన్ సైన్యం దానిని ఉల్లంఘించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు జరిపింది. ఆర్‌ఎస్ పుర సెక్టార్లో జరిపిన కాల్పుల్లో బీఎ్‌సఎఫ్ ఎస్సై మహ్మద్ ఇంతియాజ్ వీర మరణం పొందారు. సరిహద్దు అవతలి నుంచి వచ్చిన గుళ్ల వర్షానికి మరో ఏడుగురు గాయపడ్డారని బీఎ్‌సఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. జమ్ము కశ్మీర్, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో భారీగా పేలుళ్లు వినిపించాయి. సైరన్లు వినిపించాయి. చిమ్మ చీకట్లు అలముకున్నాయి. ప్రజల్లో ఎప్పట్లాగే భయాందోళనలు నెలకొన్నాయి. బారాముల్లా, బందిపొరా తదితర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ‘‘ఎక్కడా కాల్పుల విరమణ అమలు జరగడం లేదు. శ్రీనగర్ మధ్యలో ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు ఇప్పుడే తెరుచుకున్నాయి. ఇంకెక్కడి కాల్పుల ఉల్లంఘన!? శ్రీనగర్ అంతటా భారీ పేలుళ్లు వినిస్తుంటే!?’’ అని ఎక్స్‌లో జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్ధుల్లా పోస్టు చేశారు. ఇక, జమ్ము కశ్మీరు వ్యాప్తంగా పెద్దఎత్తున డ్రోన్లు కూడా ఎగిరాయి. భారత బలగాలు వాటిని అడ్డుకుని కూల్చేశాయి. ఇక, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, జైసల్మేర్ తదితర ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా లైట్లు ఆర్పేయాలని ప్రజలకు సూచించారు. అలాగే, ఉధంపూర్, బార్మర్, పఠాన్‌కోట్, జైసల్మేర్ తదితర ప్రాంతాల్లోనూ పేలుళ్లు వినిపించాయి. అక్కడ కూడా లైట్లు నిలిపివేయడంతో చిమ్మ చీకట్లు నెలకొన్నాయి. అమృత్‌సర్‌లోని ఖాతా కంటోన్మెంట్ పరిధిలో దూసుకొచ్చిన డ్రోన్లను భారత సైన్యం కూల్చేసిందని, పాకిస్థాన్ యధేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్థాన్ కాల్పులు జరుపుతోందని ప్రభుత్వ వర్గాలు ఆరోపించాయి.
ఉల్లంఘిస్తే.. ప్రతి చర్య తప్పదు: మిస్రీ
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గట్టి ప్రతి చర్య తప్పదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఒప్పందం కుదిరిన తర్వాత కూడా కాల్పులు జరపడం, డ్రోన్లతో దాడి చేయడాన్ని ఖండించారు. ఈ అంశాన్ని ‘చాలా చాలా సీరియ్‌స’గా తీసుకుంటామని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ.. ఆ తర్వాత ఉల్లంఘనలపై తీవ్రస్థాయిలో ఆందోళనల తర్వాత శనివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆయన మరోసారి విలేకరుల ముందుకు వచ్చారు. ‘‘ కొన్ని గంటలుగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు మళ్లీ మళ్లీ జరిగాయి. ఇటువంటి ఉల్లంఘనలకు తగిన, సరైన రీతిలో స్పందించే అధికారాలను భద్రతా బలగాలకు ఇచ్చాం. వీటిని చాలా సీరియ్‌సగా తీసుకుంటాం. తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ను కోరాం’’ అని మిస్రి తెలిపారు.
Updated Date - May 11 , 2025 | 05:55 AM