Operation Sindoor: ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం
ABN, Publish Date - May 11 , 2025 | 03:30 AM
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను హతమార్చింది. కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి కూడా వీరిలో ఒకడు కావడం గమనార్హం.
‘కాందహార్ విమాన’ హైజాక్ సూత్రధారి కూడా..
ఆపరేషన్ సిందూర్‌లో మట్టుబెట్టిన భారత సైన్యం
అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అత్యున్నతాధికారులు
పాక్ సైన్యం, ప్రభుత్వ ఉగ్ర లింకులు బట్టబయలు
న్యూఢిల్లీ, మే 10: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి కూడా ఉన్నాడు. ఈ ఐదుగురూ పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల్లో కీలక పాత్ర పోషించారు. వీరికి పాకిస్థాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీరి అంత్యక్రియల్లో పాక్ అత్యున్నతస్థాయి మిలిటరీ, సివిల్ అధికారులు పాల్గొనడంతో పాక్ మిలిటరీతోనూ, పాక్ ప్రభుత్వంతోనూ ఉగ్రవాదులకు ఉన్న సంబంధాలు బట్టబయలయ్యాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈనెల 7న పాకిస్థాన్, పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)లలో భారత సైన్యం నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వారిలో ఐదుగురు మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. వీరిలో ఒక ఉగ్రవాది శవపేటికపై పాకిస్థాన్ జెండాను కప్పి ఉంచిన ఫొటోపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఉగ్రవాద లింకులకు ఇది తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
హతమైన ఉగ్రవాదులు వీరే..
ముదస్సర్ ఖాదియాన్ ఖాస్: ఇతను లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. ఇతన్ని ముదస్సర్, అబూ జుందాల్ అని కూడా పిలుస్తుంటారు. ఇతను పాకిస్థాన్‌లోని మురిద్కేలో ఉన్న తాయిబా మర్కజ్ కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఇది భారత సరిహద్దుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒకప్పుడు లష్కరే తాయిబా ప్రధానకార్యాలయం. ముంబై ఉగ్రదాడి నిందితులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ కూడా ఇక్కడే ఉగ్రశిక్షణ పొందారు. ముదస్సర్ అంత్యక్రియల్లో పాకిస్థాన్ ఆర్మీ గౌరవ వందనం సమర్పించింది. అత్యున్నతస్థాయి మిలిటరీ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. పాక్ ఆర్మీచీఫ్ జనరల్ అసిం మునీర్, పాకిస్థాన్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యం నవాజ్‌ల తరఫున ఉన్నతాధికారులు ఇతని మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. ఇతని అంత్యక్రియల సందర్భంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రార్థనలకు అంతర్జాతీయ ఉగ్రవాది, జమాత్-అల్-దవాకు చెందిన హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వం వహించాడు.
హఫీజ్ ముహమ్మద్ జమీల్: జైషే మహ్మద్(జేఈఎం) ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. జేఈఎం వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మౌలానా మసూద్ అజర్‌కు ఇతను పెద్ద బావమరిది. బహవల్‌పూర్‌లోని సుభాన్ అల్లా మర్కజ్ ఇతని నిర్వహణలోనే ఉంది. జేఈఎం ఆర్థిక కార్యకలాపాలు, యువతకు ఉగ్రవాదం నూరిపోయడంలోనూ కీలక పాత్ర పోషించాడు.
మొహమ్మద్ యూసుఫ్ అజర్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. ఇతన్ని ఉస్తాద్ జీ, మొహమ్మద్ సలీం, ఘోసీ సాహెబ్ అని కూడా పిలుస్తుంటారు. ఇతను కూడా మసూద్ అజర్‌కు బావమరిది. జేఈఎం ఆయుధ శిక్షణ కార్యక్రమాల బాధ్యతలు నిర్వర్తించేవాడు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఇతని ప్రమేయం ఉంది. భారత హోంశాఖ రూపొందించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఇతని పేరు 21వ స్థానంలో ఉంది. ఇతను కాందహార్ విమానం(ఐసీ-814) హైజాక్ సూత్రధారి కూడా. 1999లో కట్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని గాల్లో ఉండగానే ఉగ్రవాదులు హైజాక్ చేసి కాదహార్‌కు తరలించారు. ప్రయాణికులను చంపేస్తామని బెదిరించి భారత జైళ్లలో ఉన్న మసూద్ అజర్‌తోపాటు ఒమర్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ఉగ్రవాదులను విడిపించుకున్నారు.
ఖాలిద్ అలియాస్ అబూ అకషా: లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. జమ్మూకశ్మీర్‌లో అనేక ఉగ్రవాద ఆపరేషన్లు నిర్వహించాడు. అఫ్ఘానిస్థాన్ ఆయుధాల స్మగ్లింగ్‌లోనూ ఇతని పాత్ర ఉంది. ఫైసలాబాద్‌లో నిర్వహించిన ఇతని అంత్యక్రియల్లో పాకిస్థాన్ మిలిటరీ సీనియర్ అధికారులతోపాటు ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు.
మొహమ్మద్ హస్సన్ ఖాన్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. జేఈఎం పీవోకే కమాండర్ ముఫ్తీ అజ్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రకుట్రల్లో కీలకంగా వ్యవహరించేవాడు.
Updated Date - May 11 , 2025 | 03:33 AM