Dharmasthala Case: ధర్మస్థల శవాల మిస్టరీ
ABN, Publish Date - Jul 21 , 2025 | 03:58 AM
కర్ణాటకలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన దర్మస్థల పరిసరాల్లో వందకుపైగా శవాలను పాతిపెట్టినట్లు వస్తున్న ఆరోపణలు
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదు
100కు పైగా శవాలను పాతిపెట్టారా? నిజాలు నిగ్గు తేల్చేందుకు ‘సిట్’ ఏర్పాటు
బెంగళూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన దర్మస్థల పరిసరాల్లో వందకుపైగా శవాలను పాతిపెట్టినట్లు వస్తున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. 1995 నుంచి 2014 వరకు అక్కడ పనిచేసిన ఓ మాజీ పారిశుధ్య కార్మికుడు.. తన చేత అనేక మంది మహిళల, మైనర్ బాలికల మృతదేహాలను బెదిరించి, బలవంతంగా పూడ్చి పెట్టించారని, దహనం చేయించారని ఆరోపిస్తూ చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది. ఈ మృతదేహాలపై లైంగిక దాడి, హత్యకు సంబంఽధించిన గుర్తులు ఉన్నాయని పేర్కొనడం మరింత సంచలనంగా మారింది. ఈ ఆరోపణలపై ధర్మస్థల పోలీసులు ఈనెల 3న కేసు నమోదు చేయగా... అసలు ఈ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మహంతి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అసలు ధర్మస్థలలో ఏం జరిగింది? అని దేశవ్యాప్తంగా పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.
అసలేం జరిగింది?
దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకాలోని ధర్మస్థలలో మంజునాథుని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. గతంలో అక్కడ పనిచేసి.. దశాబ్దం పాటు ఎక్కడికో వెళ్లిపోయి.. ఇటీవల బయటకు వచ్చిన ఓ మాజీ పారిశుధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదుతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ధర్మస్థలలో 1995 నుంచి 2014 వరకు తాను పనిచేశానని, ఆ సమయంలో అనేక మంది మహిళలు, బాలికల మృతదేహాలను ఖననం చేశానని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బలిపశువును చేశారని, బెదిరించి పాతి పెట్టించారని పేర్కొన్నారు. 2014లో ఓసారి తన కుటుంబంలోని ఒక బాలికపై లైంగిక వేధింపులు జరిగాయని, దాంతో ఆ తర్వాత తాను ధర్మస్థల నుంచి పారిపోయానని తెలిపారు. ఒక దశాబ్దం పాటు ఎక్కడో దాక్కున్న ఆయన.. 2024లో అపరాధ భావంతో తిరిగొచ్చారు. కొన్ని అస్థిపంజరాలను తవ్వి, వాటిని సాక్షాఽ్యదారాలుగా సమర్పించినట్లు సమాచారం. ఈ నేరారోపణలకు, ధర్మస్థల ఆలయ మేనేజ్‌మెంట్‌లోని ప్రభావవంతమైన వ్యక్తులకు మధ్య సంబంఽధం ఉందని, వారే నేరాలను కప్పిపుచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సమగ్ర దర్యాప్తునకు సీఎంపై ఒత్తిడి!
ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవడంతో పాటు వైరల్‌గా మారింది. గత రెండు దశాబ్దాల్లో ధర్మస్థలలో అదృశ్యమైన మహిళలు, బాలికలు కేసులు, అసహజ మరణాలు, హత్యలు, లైంగిక దాడులపై విచారణ జరపాలని కోరుతూ కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారు. అసహజ మరణాలపై సిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆరోపణల విషయంలో ప్రభుత్వం స్పందించాలని, పారదర్శక దర్యాప్తు చేయాలని కోరారు. మరోవైపు ఈ కేసు విచారణ సరైన రీతిలో జరగడం లేదని, దర్యాప్తులో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని పలు న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా, ఇదే అంశంపై యూట్యూబ్‌లో పలు కథనాలు ప్రచారం చేసిన సమీర్ తాజాగా మరో ఆరోపణ చేశారు. హోంమంత్రి పరమేశ్వర్‌తో ఇటీవల ధర్మస్థలకు చెందిన ఓ ప్రముఖుడు ఎందుకు రహస్యంగా భేటీఅయ్యారని ప్రశ్నించారు. హోంమంత్రి మీడియాతో మాట్లాడిన వేళ మెడికల్ కళాశాలకు సంబంధించిన అంశంపై ధర్మ స్థల సురేంద్ర భేటీ అయ్యారని అన్నారు. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఎవరో చెప్పారన్న కారణంతో సిట్ ఏర్పాటు చేయలేమని వ్యాఖ్యానించిన సీఎం సిద్దరామయ్య.. సామూహిక సమాధి, అదృశ్యాలు, మహిళపై నేరాల ఆరోపణలపై దర్యాప్తునకు తాజాగా సిట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి డీజీపీ (అంతర్గ భద్రతా విభాగం) ప్రణవ్ మహంతి నేతృత్వం వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 21 , 2025 | 03:58 AM