Parliament Monsoon Session: ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:58 PM
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సందర్బంగా ఆ యా పార్టీల నేతలను ఆయన కోరారు.
న్యూఢిల్లీ, జులై 20: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్రం ప్రయతిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అందులో భాగంగా ఆపరేషన్ సింధూర్‌తో సహా ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని కీలక అంశాలకు కేంద్రం సమాధానమిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని సైతం ఈ సమావేశాల్లో ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానమిస్తుందన్నారు.
పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి అంటే.. జులై 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూడిల్లీలో మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన రాజకీయ పార్టీల నేతలతో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు ఆయన సూచించారు.
ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడానికి తానే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలుమార్లు స్వయంగా ప్రకటించారు. ఈ అంశంపై సైతం సభలో చర్చిస్తామని వెల్లడించారు. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొంటారని చెప్పారు. ఇక ఈ వర్ష కాల సమావేశాల్లో ఆమోదం కోసం 17 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ పద్దతులు, విలువలు తగ్గకుండా.. ఈ సమావేశాల్లో చర్చలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఈ అఖిల పక్ష సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. ఈ సమావేశానికి 51 రాజకీయ పార్టీలకు చెందిన 54 మంది నేతలు పాల్గొన్నారని వివరించారు. ఆ జాబితాలో ఎన్డీయే, ఇండియా బ్లాక్‌తోపాటు స్వతంత్ర ఎంపీలు సైతం హాజరయ్యారన్నారు. ఈ వర్షా కాల సమావేశాలు ఆగస్ట్ 21వ తేదీతో ముగియనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
బ్రెయిన్ స్ట్రోక్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..
For More National News And Telugu News