Share News

Prevention of Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:40 PM

ప్రస్తుత పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ (సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్) అనేది చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యగా పరిణమించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి నలుగురిలో ఒక్కరు తమ జీవితకాలంలో స్ట్రోక్ బారిన పడుతున్నారు.

Prevention of Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..
Indian Stroke Association

హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ (సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్) అనేది చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యగా పరిణమించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి నలుగురిలో ఒక్కరు తమ జీవితకాలంలో స్ట్రోక్ బారిన పడుతున్నారు. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం ద్వారా స్ట్రోక్‌ను నివారించవచ్చు. అయితే, దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో.. అనేక మంది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్.. బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు.. సుభాష్ కౌల్, పి. విజయ, జీ విజయ, సలీల్ ఉప్పల్ మాట్లాడుతూ.. బ్రెయిన్ స్ట్రోక్‌ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను ఎలా గుర్తించాలి.. ఒకవేళ స్ట్రోక్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనే కీలక వివరాలను తెలిపారు.


బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి?

మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయినా లేక మెదడులోని రక్త నాళం పగిలిపోయినా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల మెదడు కణాలు మరణించి, శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవించవచ్చు.

స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు:

  • అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)

  • మధుమేహం (రక్తంలో అధిక చక్కెర స్థాయులు)

  • పొగ తాగడం, మద్యం సేవించడం

  • స్థూలకాయం, అనారోగ్యకరమైన జీవన విధానం


స్ట్రోక్ లక్షణాలను గుర్తించడం – BE FAST:

  • B – Balance (పట్టు): ఒక్కసారిగా మైకం రావడం లేదా పట్టు తప్పి పోవడం

  • E – Eyes (కళ్లు) : అకస్మాత్తుగా చూపు పోవడం లేదా మసకబారడం

  • F – Face (ముఖం): ముఖం ఒకవైపునకు జారిపోవడం

  • A – Arm (చెయ్యి) : అవయవాలు బలహీనపడటం లేదా మొద్దుబారిపోవడం

  • S – Speech (మాట): మాట్లాడేందుకు కష్టపడటం లేదా మాట అస్పష్టంగా ఉండటం

  • T – Time (సమయం): తక్షణం ఆస్పత్రికి వెళ్లాలి – తొలి 4.5 గంటలు చాలా కీలకం


సకాలంలో చికిత్స చేయడం ఎందుకు ముఖ్యం..

స్ట్రోక్ లక్షణాలను గుర్తించి, 4.5 గంటల్లోపల పేషంట్‌ను ఆస్పత్రికి తీసుకెళితే.. త్రోమ్‌బోలిసిస్ (thrombolysis) లేదా ఇతరత్రా చికిత్సలతో వారి ప్రాణాలను కాపాడవచ్చు. వైకల్యాన్ని నివారించవచ్చు.

ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..

మీ చుట్టూ ఉన్న వారెవరిలోనైనా పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి చేర్చండి. స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీలాంటిది. అలర్టుగా ఉండండి. సకాలంలో గుర్తించండి. ప్రాణాలను కాపాడండి.

Updated Date - Jul 20 , 2025 | 03:40 PM