Air India: ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఝలక్
ABN, Publish Date - Jun 22 , 2025 | 10:08 AM
ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దగ్ధం కావడంతో.. విమాన ప్రయాణం అంటనే ప్రయాణికులు హడలిపోతున్నారు.
పాట్నా, జూన్ 22: అహ్మదాబాద్ - లండన్ విమాన ప్రమాద ఘటన అనంతరం ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల్లో సాంకేతిక లోపాలే కాదు.. ఆ సంస్థలోని సిబ్బంది నిర్లక్ష్యం సైతం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు ఉన్నతాధికారులపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అలాంటి వేళ.. ఎయిర్ ఇండియా సిబ్బంది మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శనివారం ఉదయం బెంగళూరు నుంచి.. చెన్నై నుంచి.. రెండు వేర్వేరు విమానాలు బిహార్ రాజధాని పాట్నాకు చేరుకున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ప్రయాణికులకు లగేజీ తీసుకునేందుకు ఆ పాయింట్‌కు చేరుకున్నారు. కానీ అందులో వారి లగేజీ లేకపోవడంతో వారంతా ఖంగుతిన్నారు. తమ లగేజీ ఏమైందంటూ వారు ఎయిర్ పోర్ట్ అధికారులను నిలదీశారు. దాంతో ఆ యా విమాన సర్వీసుల సిబ్బందిని ఎయిర్ పోర్ట్ అధికారులు ఆరా తీశారు. పరిమితికి మించి లగేజీ ఉండడం వల్ల విమానంలో ప్రయాణికుల బ్యాగేజీ తీసుకు రాలేకపోయామంటూ సిబ్బంది తెలిపారు. ఆ క్రమంలో ఎయిర్‌పోర్ట్ అధికారులపై ప్రయాణికులు మండిపడ్డారు. దీంతో పాట్నా ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది.
మరోవైపు ఈ ఘటనపై ప్రయాణికుడు స్పందించారు. ఎయిర్ ఇండియా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వివాహ వేడుకకు హాజరుకావాల్సి ఉందని.. తన లగేజీ ఎప్పడు వస్తుందో కూడా తనకు తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో ప్రయాణికుడు అయితే.. తాను మరో విమానాన్ని అందుకోవాల్సి ఉందన్నారు. లగేజీ ఏ సమయానికి వస్తుందో తెలియదన్నారు. అప్పటి వరకు తనకు ఈ టెన్షన్ తప్పదన్నారు. ఇక ఈ తరహా ఘటన గత 15 రోజుల్లో ఇలా రెండో సారి చోటు చేసుకుందంటూ ఎయిర్ ఇండియా సంస్థపై ప్రయాణికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉగ్రవాదులకు ఝలక్ ఇచ్చిన జమ్మూ కశ్మీర్ పోలీసులు
తరగతి గదిలో విద్యార్థులు.. వారి ఎదుటే ఆ ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే..
For National News And Telugu News
Updated Date - Jun 22 , 2025 | 10:11 AM