Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. తొమ్మిది మంది మృతి
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:51 AM
వివాహ వేడుకకు వెళ్లొస్తుండగా ఘోర రోడ్డుప్రమాదం జరిగిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
కోల్‌కతా, జూన్ 20: పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. శుక్రవారం ఉదయం జాతీయ రహదారి-18పై నోమిషల్ గ్రామ సమీపంలో బొలెరో వాహనం.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే వారంతా అప్పటికే మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అందులో భాగంగా మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పురులియాలోని బారాబజార్ పోలీస్ స్టేషన్ పరిధి అడబానా గ్రామంలో జరిగిన వివాహానికి వీరంతా హాజరై.. కారులో తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రం నిమ్దిహ్ సమీపంలోని తిలైతాండ్‌కు వారంతా వెళ్తున్నారని వివరించారు. అతి వేగంతోపాటు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ప్రమాద వార్త తెలియగానే వారి కుటుంబలో తీవ్ర విషాదం నెలకొంది. కొన్ని గంటల క్రితమే వీరంతా వివాహ వేడుకల్లో పాల్గొని.. సందడి చేశారని.. పెళ్లికి వచ్చిన బంధువులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వీరు బయలుదేరిన కొన్ని గంటలకే మృతిచెందారని తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లామ్నుంథెం సింగ్సన్‌కు కడసారి వీడ్కోలు.. భారీగా తరలి వచ్చిన ప్రజలు
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. గిఫ్ట్‌లు వైరల్
For National News And Telugu News
Updated Date - Jun 20 , 2025 | 12:20 PM