Share News

Lamnunthem Singson: లామ్నుంథెం సింగ్సన్‌కు కడసారి వీడ్కోలు.. భారీగా తరలి వచ్చిన ప్రజలు

ABN , Publish Date - Jun 20 , 2025 | 10:58 AM

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో వందలాది మంది మరణించారు. ఆ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు.

Lamnunthem Singson: లామ్నుంథెం సింగ్సన్‌కు కడసారి వీడ్కోలు.. భారీగా తరలి వచ్చిన ప్రజలు
Lamnunthem Singson

ఇంఫాల్, జూన్ 20: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో మరణించిన లామ్నుంథెం సింగ్సన్ మృతదేహం స్వస్థలానికి చేరుకుంది. గురువారం రాత్రి ఆమె మృతదేహాన్ని మణిపూర్‌లోని కాంగ్పోక్పి పట్టణాని‌కి చేరింది. అంతకుముందు అహ్మదాబాద్ నుంచి దిమ్మాపూర్‌లోని విమానాశ్రయానికి ఆమె మ‌ృతదేహాన్ని ఇండిగో విమానంలో తీసుకు వచ్చారు. ఈ సందర్బంగా ఈ మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు ఆమె కుటుంబ సభ్యులు, కూకీ తెగకు చెందిన ప్రజలతోపాటు ఉన్నతాధికారులు భారీ ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. అనంతరం దిమ్మాపూర్ నుంచి ఆమె స్వస్థలం కాంగ్పోక్పికి భారీ ఊరేగింపుగా తీసుకు వెళ్లారు.


ఆ క్రమంలో రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో కొద్దిసేపు ఆమె మృతదేహాన్ని నిలిపారు. స్థానికులు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయితే ఆమె అంత్యక్రియలు శుక్రవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వివరించారు. రాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించడం కూకీ తెగకు విరుద్ధమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రార్థనలు, ప్రజల సందర్శన అనంతరం శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆమె మృతదేహానికి కూకీ కమ్యూనిటీ దిమ్మాపూర్, కూకీ స్టూడెంట్స్ యూనియన్ నాగాలాండ్, నాగా కౌన్సిల్ దిమ్మాపూర్, దిమ్మాపూర్ డిస్ట్రిక్ట్ సిటిజన్స్ ఫోరమ్‌తోపాటు పలు రాజకీయ సంఘాల నేతలు ఘన నివాళులర్పించారు.


విమానంలో అటెండెంట్‌గా లామ్నుంథెం సింగ్సన్ విధులు నిర్వహిస్తున్నారు. ఆమె కుటుంబం గతంలో ఇంఫాల్‌లోని ఓల్డ్ లంబులేన్ కాలనీలో నివాసముండేది. అయితే 2023లో మైతేయి, కూకీ జాతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబం కాంగ్పోక్పి పట్టణాని‌కి తరలి వెళ్లింది. మరో వైపు ఇదే విమాన ప్రమాదంలో మైతేయి తెగకు చెందిన మరో యువతి మరణించింది. ఆమె సైతం విమానంలో అటెండెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె మృతదేహం ఇంకా ఇంఫాల్ చేరుకోలేదు.


జూన్ 12వ తేదీ అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలి దగ్ధమైంది. ఈ విమానం బీజే హాస్టల్‌పై కూలింది. దీంతో విమానంలో ఒక్కరు మినహా మిగిలిన 229 మంది మరణించారు. అలాగే విమాన సిబ్బంది 12 మంది సైతం మరణించారు. అదే విధంగా బీజే హాస్టల్‌లో భోజనం చేస్తున్న 29 మంది మెడికోలు సైతం మృతి చెందారు. అయితే వీరి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి.. కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు 198 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. వాటని వారి కుటుంబ సభ్యులు అందజేశారు. మరికొద్ది రోజుల్లో ఈ డీఎన్ఏ పరీక్షల ప్రక్రియ పూర్తికానుంది అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. గిఫ్ట్‌లు వైరల్

కొనసాగుతోన్న యుద్ధం.. తొలిసారి క్లస్టర్ బాంబులు ప్రయోగించిన ఇరాన్

For National News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 10:58 AM