US Attack Iran: ఇరాన్‌పై అమెరికా దాడుల్లో 1989 నాటి బాంబర్ల ఉపయోగం.. వాటి స్పెషల్ ఏంటి
ABN, Publish Date - Jun 22 , 2025 | 07:34 AM
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ప్రత్యక్ష దాడులతో (US Attack Iran) రంగంలోకి దిగింది. ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అయితే ఈ దాడుల్లో అమెరికా ఎలాంటి బాంబర్లను ఉపయోగించింది, వాటి స్పెషల్ ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్-ఇరాన్ వార్ విషయంలో అమెరికా (America) జోక్యం చేసుకుంటుందన్న ప్రచారానికి బ్రేక్ పడింది. తాజాగా అమెరికా సైన్యం ఇరాన్‌లోని మూడు కీలక ప్రాంతాలపై దాడులు (US Attack Iran) చేసింది. ఈ చర్య ద్వారా మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను ప్రకటించారు. ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫాహాన్‌లో ఉన్న మూడు అణు కేంద్రాలపై బీ2 స్టెల్త్ బాంబర్లను (B2 Stealth Bombers) ఉపయోగించామని అంటున్నారు. ఈ దాడి అమెరికా, ఇజ్రాయెల్, ప్రపంచానికి ఒక చారిత్రక క్షణమని ట్రంప్ వ్యాఖ్యానించారు.
బీ 2 స్టెల్త్ బాంబర్ అంటే ఏంటి?
బీ 2 స్టెల్త్ బాంబర్ అమెరికా వైమానిక దళంలో ఒక ప్రత్యేకమైన ఆయుధం. ఇది అమెరికా స్టెల్త్ టెక్నాలజీతో పనిచేస్తుంది. 1989లో తొలిసారి ఈ బాంబర్ ఉపయోగించారు. ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన విమానాల్లో ఇది ఒకటిగా ఉండటం విశేషం. శత్రువు రక్షణ వ్యవస్థలను చొచ్చుకెళ్లే సామర్థ్యం ఈ విమానానికి ఉందని, దీని తయారీ సంస్థ నార్త్‌రోప్ గ్రమ్మన్ చెబుతోంది. ఈ బాంబర్ రహస్యంగా దాడులు చేయగలదు. శత్రువు రాడార్‌లకు దొరకకుండా లక్ష్యాలను ధ్వంసం చేస్తుందని అంటున్నారు.
దీనిని ఎందుకు ఉపయోగించారు?
బీ2 స్టెల్త్ బాంబర్లు గ్వామ్‌కు వెళ్తున్నాయనే వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ట్రంప్ ప్రభుత్వం ఫోర్డోలోని భూగర్భ యురేనియం సంవృద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని 30,000 పౌండ్ల బరువున్న మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబును ఉపయోగిస్తుందని ఊహాగానాలు వచ్చాయి. ఈ ఊహాగానాలకు ట్రంప్ ప్రకటనతో సమాధానం దొరికింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేసి, ఆ దేశ అణు కార్యక్రమాన్ని అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. బీ2 బాంబర్ మాత్రమే మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబును మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒక్కో బాంబర్ రెండు ఇలాంటి బాంబులను తీసుకెళ్లగలదు. ఈ బాంబులు భూగర్భంలో ఉన్న లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగలవు. అందుకే ఫోర్డో వంటి భూగర్భ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు బీ2 బాంబర్‌ను ఎంచుకున్నారు.
దాడి వివరాలు
ట్రంప్ ప్రకటన ప్రకారం ఫోర్డోపై ఆరు బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించారు. నటాంజ్, ఎస్ఫాహాన్‌లోని మిగతా రెండు అణు కేంద్రాలపై 30 టోమాహాక్ క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల లక్ష్యం ఇరాన్ అణు విధానాన్ని పూర్తిగా నాశనం చేయడమేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడులు అమెరికా సైనిక సామర్థ్యాన్ని, స్టెల్త్ టెక్నాలజీ శక్తిని ప్రపంచానికి చాటాయని ఆయన ప్రస్తావించారు. ఇరాన్ అణు వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చాయి. ఈ దాడులు ఇరాన్ అణు సామర్థ్యాన్ని తగ్గించడంతో పాటు, మధ్య ప్రాచ్యంలో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
ఫోర్డోతో సహా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా ఎటాక్
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 22 , 2025 | 07:41 AM