Putin India Visit: రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన.. భారత్‌కు ఐరోపా నుంచి వినతుల వెల్లువ
ABN, Publish Date - Dec 04 , 2025 | 02:26 PM
పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్‌కు ఐరోపాదేశాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌కు స్నేహితుడైన పుతిన్ యుద్ధం విరమించేలా నచ్చచెప్పాలంటూ ఐరోపా దేశాల ప్రతినిధులు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తరువాత పుతిన్‌కు ఇది తొలి భారత పర్యటన. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఏళ్లతరబడి కొనసాగుతుండటం ఐరోపా దేశాల్లో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటనను పురస్కరించుకుని ఐరోపా దేశాలు భారత్ సాయం కోసం తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి (Putin India Tour).
యుద్ధాన్ని విరమించేందుకు పుతిన్‌కు నచ్చ చెప్పాలంటూ అనేక దేశాల ప్రతినిధులు, దౌత్యవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రధాని మోదీకి పుతిన్ ఫ్రెండే కాబట్టి ఆయన మాట వినే అవకాశం ఎక్కువగా ఉందని ఐరోపా దేశాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మర్యాదపూర్వకంగా కోరాయట.
2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తొలి నాళ్లల్లో ఐరోపా దేశాలు భారత్‌పై అనేక ఒత్తిళ్లు తెచ్చాయి. రష్యా తీరును ఖండించాలని డిమాండ్ చేశాయి. రష్యాతో భారత్ తన బంధాన్ని తెంచుకోవాలని కూడా ఆశించాయి. ఏదో పక్షానికి మద్దతుగా ఉండాలని వివిధ దేశాల ప్రతినిధులు భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, పుతిన్ ఎంతకీ లొంగకపోవడంతో ఐరోపా దేశాలు రూటు మార్చుకున్నాయి. భారత్ జోక్యంతో సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించేందుకు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అయితే, భారత్ మాత్రం తటస్థ వైఖరినే కొనసాగించింది. యుద్ధాలు చేసే కాలం ముగిసిందని ప్రధాని మోదీ గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. ఇక పుతిన్ పర్యటన సందర్భంగా భారత్ ఇదే విషయాన్ని హైలైట్ చేసే అవకాశం ఉందని సమాచారం.
భారత్, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరి పాతికేళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో పుతిన్ తాజా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక 2010లో పుతిన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల బంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా గుర్తించడంతో దౌత్య బంధం మరింత బలోపేతమైంది.
ఇవీ చదవండి:
కూలిన అమెరికా ఎఫ్-16సీ ఫైటర్ జెట్.. పైలట్ సేఫ్
తీరు మార్చుకోని పాక్.. భారత గగనతలంలోకి విమానాలను అనుమతించినా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 04 , 2025 | 02:40 PM