Pak Fake Propaganda: తీరు మార్చుకోని పాక్.. భారత గగనతలంలోకి విమానాలను అనుమతించినా..
ABN , Publish Date - Dec 02 , 2025 | 02:05 PM
పాక్ మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టుకుంది. పాక్ విమానాలు భారత్ మీదుగా ప్రయాణించేందుకు అడిగిన వెంటనే అనుమతిచ్చినా అసత్య ప్రచారానికి తెర తీసింది. భారత్ అనుమతులను నిరాకరించిందంటూ పాక్ మీడియా వార్తలను వండివార్చింది. అయితే, భారత వర్గాలు పాక్ దుర్నీతిని ఎండగట్టాయి.
ఇంటర్నెట్ డెస్క్: దిత్వా తుపానుతో ఇబ్బందుల్లో పడిపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరిట మానవతాసాయాన్ని అందిస్తోంది. ఇక శ్రీలంకకు తామూ సాయం చేస్తామన్న పాక్‌కు కూడా భారత్ సహకరించింది. పాక్ విమానాలు భారత గగనతలం మీదుగా శ్రీలంక చేరేందుకు అడిగిన వెంటనే అనుమతించింది (India Condemns Pak Fake Propaganda Over Aid To Srilanka).
అయితే, భారత్‌పై దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్న పాక్ మరోసారి తన కుయుక్తులను ప్రయోగించింది. పాక్ మీడియా భారత్‌పై ఫేక్ వార్తలను వండివార్చింది. మానవతా సాయానికి ఉద్దేశించిన విమానాలను కూడా భారత్ తన గగనతలంలోకి అనుమతించలేదంటూ వార్తలను ప్రచురించింది.
పాక్ దుష్ప్రచారాన్ని భారత్ వర్గాలు వెంటనే ఖండించాయి. పాక్ అడిగిన వెంటనే కావాల్సిన అనుమతులు ఇచ్చామని తెలిపాయి. ప్రామాణిక పద్ధతులు, సాంకేతిక అంశాలు, భద్రతా పరమైన సమస్యలను పరిగణలోకి తీసుకుని అనుమతులు ఇచ్చామని తెలిపాయి.
భారత వర్గాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 1 గంటకు పాక్ అధికారికంగా అనుమతిని కోరింది. సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రజలను దృష్టిలో పెట్టుకుని భారత్ అత్యంత వేగంగా స్పందించింది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే కావాల్సిన అనుమతులను జారీ చేసింది. పాక్ మీడియా వార్తలన్నీ అసత్యాలేనని భారత వర్గాలు తేల్చి చెప్పాయి.
ఇక శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ 53 టన్నుల వివిధ రకాల సహాయక సామగ్రిని పంపించింది. శ్రీలంక ఎయిర్ ఫోర్స్‌తో కలిసి భారత నేవీ పలు సహాయక చర్యల్లో పాల్గొంటోంది. జాతీయ విపత్తు నిర్వహణ బృందం, వైద్య బృందాన్ని కూడా శ్రీలంకకు పంపించింది. ఈ నేపథ్యంలో శ్రీలంక భారత్‌కు ధన్యవాదాలు కూడా తెలిపింది. మరో దిత్వా బారిన పడి ఇప్పటివరకూ 360 మంది కన్నుమూశారు. మరో 370 మంది గల్లంతయ్యారు. నిర్వాసితులుగా మారిన సుమారు 2 లక్షల మందిని ప్రభుత్వం తాత్కాలిక వసతి కేంద్రాలకు తరలించింది. కండి, బదుల్లా, నువారా ఎలియా, మటాలే జిల్లాలో తుఫాను బీభత్సం అధికంగా ఉంది.
ఇవీ చదవండి:
ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా ఆదాయాన్ని కోల్పోనున్న అమెరికా యూనివర్సిటీలు
నా పార్టనర్ భారత మూలాలున్న వ్యక్తి, నా కొడుకు పేరు శేఖర్: ఎలాన్ మస్క్